కాంగ్రెస్ లోనించి తెలుగుదేశంలోకి వలసలు!!

0tdp-and-congressఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయంటారు, బహుశా ఇదేనేమో. క్రితం సంవత్సరం అంతా తెలుగుదేశం నించి ఫలానా నాయకుడు వెళ్తున్నాడు అంటూ పత్రికలు రాసేవి. చివరికి ఇద్దరు ముగ్గురు మినహా ఎవ్వరూ పోక పోయినా పత్రికలు మాత్రం తెగ రాసేశాయి. కానీ ఆ వార్తలు అన్నీ పత్రికలు తమ సోర్సెస్ ప్రాతిపదికగా రాసినవి, కొండకచో కొన్ని మైండ్ గేమ్లో బాగంగా రాసినవి.

కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి వేరు. రాష్ట్ర కాంగ్రెస్ లో నించి ఎవరెవరు ఇతర పార్టీల్లోకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి పోతారు అనేది పత్రికలు ఊహించనవసరం లేదు. కాంగ్రెస్ నాయకులే పిలిచి మరీ ఫీలర్లు ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్, ఒక పార్టీగా రాయలసీమ ఆంధ్రల్లో మరీ అంత దిగజారిపోయిందో, లేక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు, మునిగి పోయే కాంగ్రెస్ పడవ లో నించి ముందుగానే దూకెస్తూ తమ జాగ్రత్తలు తాము పడుతున్నారో తెలియదు కానీ వలసల వార్తలు మాత్రం గుప్పుమంటున్నాయి.

ముందుగా జె సీ దివాకర్ రెడ్డి .. ఈయన సామాన్యంగా ఏదీ రహస్యం వుంచడు. ఒక్కోసారి ఆయన ‘ఓవర్ ఫ్రాంక్నెస్’ ఆయనతో పాటుగా, ఆయన పార్టీకి, ఒక్కోసారి ప్రత్యర్ధి పార్టీలకు కూడా ఇబ్బంది కలిగించినా ఆయన మాత్రం పెద్ధగా తన నైజం మార్చుకోలేదు. ఇపుడు కూడా చాలా కూల్ గా, చాలా ప్లెయిన్ గా తానే ఏ పార్టీలోకి మారనేమో కానీ, తన కొడుకు, తన తమ్ముడు మారితే తానేమీ చేయగలనని నర్మగర్భంగా నిజాన్ని చెప్పేస్తున్నాడు.

ఇక కోస్తాలోని కాపు నేతలు. గత నెల రోజుల నించి ఉత్తర కోస్తా, కోస్తా ప్రాంతాలకు చెందిన ముఖ్యమైన కాపు నాయకులు తెలుగు దేశంలోకి వస్తున్నారన్న వార్త కాంగ్రెస్ వర్గాల్లో హోరెత్తుతోంది. ముఖ్యంగా ఘంటా శ్రీనివాసరావు, భండారు, కొత్తపల్లి, వంగా గీత మొదలగు వారు తెలుగుదేశం లోకి రావడానికి చంద్రబాబు అనుమతి కోసం వేచి చూస్తున్నారని తెలుస్తోంది. ఒక్క సారి చంద్రబాబు అనుమతీస్తే దూకేయడానికి రెడీగా వున్నారని అంచనా. కానీ చంద్రబాబే ఇంకా పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వలేదని చెప్తున్నారు.

ఇక గుంటూరు జిల్లాలో కూడా మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని ఒక సిట్టింగ్ ఏంఎల్ ఏ కూడా తన ప్రయత్నాలను తెలుగుదేశంలోని ఒక ప్రముఖ నాయకుడి ద్వారా చేస్తున్నారని అంటున్నారు. అయితే దీనికి చంద్రబాబు అంత సుముఖత చూపలేదని తెలుస్తోంది. కానీ ఇంకా ద్వారాలు పూర్తిగా మూయబడలేదు.

అలాగే చిత్తూరు జిల్లాలో కూడా అక్కడి ముఖ్య పట్టణంలో ఒక ప్రముఖ రాజకీయవేత్త కుమారుడు తెలుగుదేశం అభ్యర్దిగా పోటీ చెయ్యడానికి సిద్ధంగా వున్నాడని, అయితే ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో కుప్పం కి దగ్గరగా ఇంకొక చిన్న పట్టణ నియోజకవర్గంలో కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇలా రాష్ట్రం లో పలు ప్రాంతాలో కాంగ్రెస్ నాయకులు తమ పడవ తిరగబడ పొయ్యే లోపల తట్టా బుట్టా సర్దుకొనే ఆలోచనలో వున్నారు. ఈ వలసలన్నీ సఫలమౌతాయా అనేది పూర్తిగా ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఈపాటికే వున్న తెలుగుదేశం పార్టీ మద్దతుదార్ల అభిప్రాయాలూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి వుంది. నిర్ణయాలు కూడా ఆ మేరకే వుంటాయి. కానీ కాంగ్రెస్ లో నించి వలసల పర్వం మొదలయిందనేది మాత్రం ఖచ్చితం..!!