వైకాపా భవిష్యత్తు ఏమిటి ?

0

ysrcp-jaganఆంధ్రప్రదేశ్ రాజకీయ చదరంగంలో పావులు కడపటంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోందా ? ఇటీవలి పరిణామాలు అందుకు అవుననే అంటున్నాయి. గతంలో పార్లమెంటులో రాష్ట్రవిభజన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో పార్లమెంటు సభ్యుడు, వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర ప్లే కార్డు ప్రదర్సించినప్పటినుంచి ఆ పార్టీ తప్పటడుగులు వేస్తూనేవుంది. ఆ తరువాత ఇడుపులపాయ లో తెలంగాణా కు వ్యతిరేకం కాదన్న వైఖరిని ఆ పార్టీ స్పష్టంగా చెప్పింది. అయినా పంచాయితీ ఎన్నికలలో వైకాపా కు తెలంగాణా లో దారుణమైన చేదు అనుభవం ఎదురయింది. దాంతో ఇక తెలంగాణలో తమ పార్టీ కి భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్న వైకాపా కాంగ్రెస్ రాష్ట్రవిభజన ప్రకటనకు ముందే సమైక్యాంధ్ర కు మద్దత్తుగా తన పార్టీ ఎం ఎల్ ఎ ల చేత మూకుమ్మడి రాజీనామాలు చేయించింది.

ఈ చర్య ద్వారా కనీసం సీమాంధ్ర లో నైనా బతికి బట్టకట్టగలమన్న భావనతో వైకాపా వుంది. అందువల్లనే సీమాంధ్ర ఉద్యమంలో ఆ పార్టీ చురుకుగా పాల్గొంటోంది. అయితే అసలు రాష్ట్రవిభజన కు 1999 లో 41 మంది శాసనసభ్యులతో తెలంగాణా కు అనుకూలంగా అధిష్టానానికి లేఖ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే కారణమంటూ కాంగ్రెస్ పార్టీ గత కొద్దిరోజులుగా సందర్భం వచ్చినప్పుడల్లా అన్ని స్థాయిలలో మాట్లాడుతోంది. దీంతో సహజంగానే వై కా పా ఆత్మరక్షణలో పడింది.

సాక్షాత్తూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ వై ఎస్ ఆర్ కుటుంబాన్ని నిలదీస్తూ అస్త్రాలు సంధిస్తున్నారు. విభజనకు కారకుడైన వై ఎస్ ఆర్ కుటుంబం మళ్లీ అదే విభజనకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇందువల్ల తాము సీమాంధ్ర ఉద్యమంలో ఆత్మవిశ్వాసంతో పాల్గోనలేకపోతున్నామని వై కా పా నాయకులు అంటున్నారు. ఏదేమైనా తెలంగాణా లో బుకింగ్ క్లోజ్ చేసుకున్న వై కా పా సీమాంధ్ర లో ఎంతవరకు తన ఉనికిని చాటుకుంటుందో వేచి చూడాల్సిందే.