ఉపదేశం కోసమే కృష్ణావతరం

0Krishna-Avataramఇలా నడుచుకోవాలి అని ఆచరణని చేసి చూపినవాడు శ్రీరాముడైతే ఆచరించినదానిని ఒక గ్రంథముగా మనకి అందించిన మహానుభావుడు శ్రీకృష్ణభగవానుడు. అందుకే రామావతారం ఆచరణకి, శ్రీకృష్ణావతారం ఉపదేశానికి ఈ మానవ జాతికి అందినవి అని మన పెద్దలు చెప్తారు. రామచంద్రుడు పదకొండువేల సంవత్సరాల కాలం ఆచరించిన దానిని శ్రీ కృష్ణుడు భగవద్గీత లో మనకి ఉపదేశం చేశాడు. భగవద్గీతలో ఉండే ప్రతీ శ్లోకం లో మనకొక మంచి సందేశాన్ని తానిచ్చాడు.

మనిషికి సత్పురుషుల సహకారం, అనుగ్రహం లభించిన తర్వాత ఏర్పడవలసింది భగవంతుని కరుణ. భగవంతుడు మనల్ని ఎప్పటికీ బాగుపడాలనే చూస్తాడు. భగవంతుని చెంతన కొందరు ఎప్పటికీ ఉంటారు వారిని నిత్యులు అని అంటారు.  ప్రకృతి బారిన పడి రక్షింపబడిన వారు కొందరు, వారిని ముక్తులు అని అంటారు. ఇక్కడే ప్రకృతిలో ఉంటూ బంధించబడి కొందరు ఉంటారు వారినే బద్దజీవులు అని అంటారు. కర్మ చేత బంధించబడి, మనల్ని ఎల్లప్పటికీ ఇక్కడే ఉండేట్టు చేసేది కర్మ, ఆ కర్మ ప్రభావానికి లోనైన వారిమి మనం. అందుకే మనల్ని బద్దులు అని అంటారు. ఇలాంటి మనల్ని భగవంతుడు ఉద్దరించాలని కోరుకుంటాడు. మనకు ఉపాకారం చేయాలని భగవంతుడు  వేసిన వేరు వేరు రూపాలే ఆయన అనేక అవతారాలు. అలాంటి అవతారాల్లో ఇప్పుడు మనం ఉన్న కలియుగానికి ముందు ఉన్న ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడనే నామంతో అవతరించాడు. తనకున్న అద్భుతమైన కళ్యాణ గుణాలను అందిస్తూ ఆనందింపజేయాలన్నదే ఆయన పేరులోని అర్థం. ‘కృష్’ అంటే అపరితమైన ‘ణ’ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం. మనం కోరుకొనేది ఆనందం. మనం లోకంలో చేసే ప్రతి పని ఆనందం కోసమే కదా చేసేది. ఆనందం ఎందుకు కోరుకుంటాం అంటే సమాధానం ఏమిటి కనక. ఆనందానికంటూ మరో ప్రయోజనం మరొకటి ఉండదు. మనిషి కోరేది దుఖం కలగ కుండా ఉండాలి, ఆనందం నిత్యంగా ఉండాలి అనే. అట్లాంటి ఆనందమే భగవానుడు. అందుకే ఆయన ఆనందాన్ని ఇవ్వగలడు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అది సులభంగా తెలియడానికే ఆయన పేరు కృష్ణ అని.

ఆయన ఆనందాన్నిఇవ్వగలడు, కానీ ముందు మనం అది కోరగలగాలి. భగవంతుడు ఇస్తాను అన్నా మనం కోరుకునే స్థితిలో మనం లేము కనక తన అందాన్ని చూపి, తన ఆనందాన్ని చూపి, తన చేష్టలను చూపి, తనవైపు ఆకర్శించేలా చేసుకుంటాడు. మనం రకరకాల భాదలు పొందేవాళ్ళం. మన భాదలు ఏమిటో తెలుసు కనక దానికి తగిన అవతారం ఎత్తి రక్షిస్తాడు. కృష్ణావతారం ఎత్తి మనల్ని ఆనంద మార్గంలో నడిపించాలి అని అనుకున్నాడు. మనకు ఆకోరిక లేదు, కనుక కోరిక కూడా తానే కలిపిస్తాడు. కృష్ణావతారం లో అలా ఆయన కోరిక కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడు. అలా చేసిన ప్రయత్నాల్లో ఒక ఫలించిన ప్రయత్నమే మహభారత సంగ్రామం. పాండవులు తమ శక్తి మీదే ఆధారపడ్డ వారు. ఎప్పుడెప్పుడు వారికి కష్టం ఏర్పడిందో, భగవంతుని అవసరం తప్పనిసరి అని గుర్తించారు. స్వార్థం, ఆధిపత్యం వంటి స్వభావాలను తగ్గించుకుంటే తప్ప బాగుపడే అవకాశం లేదు. అలాంటి స్వభావాలు ఎక్కువగా కల కౌరవులని ఓడిపోయేట్టు చేసాడు. ఆయన తలచుకుంటే వారిరువురి మధ్య సఖ్యాన్ని ఏర్పరచి యుద్దాన్ని ఆపేయగలిగేవాడు. సాత్విక స్వభావులైన వారు పాండవులు. కౌరవులు తమ కుండే సుఖాలయందు తృప్తి లేక, ఇతరులని శ్రమింపజేసే వారు. తన సుఖం కోసం ఎదుటివారిని కష్టపెట్టే మనస్సు వారిది. పాండవులు తాము శ్రమించిపోయినా సరే ఎదుటివారు సుఖంగా ఉంటే చాలు అని అనుకొనేవారు. అందుకే పాండవులను పైకి తీసుకు రావడానికి వారిలో ముందు కోరిక కలిగించాడు, వారికి సహకరించాడు. ఆపై నీవే తప్ప మరొకరు లేరు అని శరణాగతి చేసినందుకు సర్వవిద సహకారాలను అందించాడు. మనిషి బాగుపడాలంటే మొదట కావల్సింది ఉపదేశం. అదే క్రిష్ణ పరమాత్మ చేసిన భగవద్గీతోపదేశం.

 

చిన్న జీయర్ స్వామి వారు చేసిన ఉపన్యాసంలోని సంగ్రహణం