పూజలో భగవంతునికి భక్తులు అర్పించాల్సిన షోడశోపచారాలు

0nitya pooja vidhanam in telugu1.ఆవాహనం: మనం పూజించే దేవుణ్ణి మన గృహంలోని పటం లేదా విగ్రహం లోనికి రావలసిందిగా ఆహ్వానించడమే ఆవాహనం. ఈ సేవ చేసేటప్పుడు ఎడమచేతిని మన హృదయం మీద ఉంచుకుని, కుడిచేతిని భగవంతుని పాదాల మీద ఉంచి, రెండు అక్షతలు వేయాలి. 
 
2. ఆసనం: విగ్రహంలోనికి లేదా పటంలోనికి భగవంతుడు వచ్చిన తర్వాత చేయవలసిన సేవ ఆసనం అందించడం. మనం పూజించే ఆ దైవాన్ని పేరు పెట్టి స్తుతిస్తూ, ‘నవరత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి’ అని పూవులు, అక్షతలు ఆయన ముందు ఉంచాలి. 
 
3. అర్ఘ్యం, పాద్యం, ఆచమనం: ఈ మూడు సేవలూ ఇంచుమించు ఒకేవిధంగా ఉంటాయి. దైవానికి కాళ్లు కడుగుతున్నట్లుగా భావిస్తూ, పంచపాత్రలోని నీటిని తీసుకుని, ‘పాద్యం సమర్పయామి’ అంటూ ఆ విగ్రహం లేదా పటం ముందు ఉంచిన ఒక చిన్న గిన్నె (దీనిని అర్ఘ్యపాత్ర అంటారు)లో  ఉద్ధరిణెడు వేయాలి. ఆ తర్వాత చేతులు కడుగుతున్నట్లుగా భావిస్తూ ‘అర్ఘ్యం సమర్పయామి’ అని, రెండు ఉద్ధరిణల నీటిని  విగ్రహానికి చూపిస్తూ, ఆ పాత్రలో వేయాలి. తర్వాత మంచినీరందించినట్లుగా మూడు ఉద్ధరిణల నీటిని తీసుకుని, అర్ఘ్యపాత్రలో వేయాలి. 
 
4. పంచామృతస్నానం: భగవంతునికి స్నానం చేయిస్తున్న భావనతో, ‘పంచామృతస్నానం సమర్పయామి’ అంటూ ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెరలతో అభిషేకం చేయాలి. అనంతరం ‘శుద్ధోదక స్నానం సమర్పయామి’ అంటూ పవిత్రోదకంతో అభిషేకం చేయాలి. 
 
5. వస్త్రం: స్నానం చేసిన అతిథికి వస్త్రం ఇవ్వాలి కదా! రెండు గుండ్రటి ఒత్తులు తీసుకుని, పసుపు, కుంకుమ అద్ది, ‘వస్త్రయుగ్మం సమర్పయామి’ అంటూ విగ్రహం లేదా పటం మీద ఉంచాలి. విగ్రహం పెద్దదైతే గనుక ఆ విగ్రహానికి పంచనుకట్టబెట్టి, కండువాను మెడలో వేయాలి. 
 
6. ఉపవీతం: భగవంతునికి (స్త్రీ దేవత అయినా సరే) పత్తితో చేసిన మూడు వత్తులకు పసుపు, కుంకుమలతో అలంకరించి యజ్ఞోపవీతంలా అలంకరించాలి. పరిమాణాన్ని బట్టి సిసలైన యజ్ఞోపవీతాన్ని కూడా అలంకరింపవచ్చు. 
 
7. ధూపం, దీపం: రెండు లేదా మూడు అగరువత్తులను వెలిగించి, స్వామివారు లేదా అమ్మవారికి చూపించి, ధూపం సమర్పయామి’ అంటూ స్టాండులో ఉంచాలి. ఆ తర్వాత ‘దీపం దర్శయామి’ అంటూ రెండు లేదా మూడు వత్తులను వెలిగించి, చేతితోనే చూపించాలి. 
 
8.  గంధ, పుష్ప, అక్షతలు: ‘గంధం సమర్పయామి’ అంటూ మంచి గంధాన్ని లేదా శ్రీ చందనాన్ని పుష్పంతో తీసుకుని, విగ్రహం మీద చిలకరించాలి. అనంతరం ‘పుష్పాన్ సమర్పయామి’, అంటూ సువాసన గల పూవులను అలంకరించాలి. ఆ తర్వాత దైవానికి సంబంధించిన శత లేదా సహస్ర నామాలనో అష్టోత్తరాన్నో చదువుతూ అక్షతలతో లేదా పూలతో పూజించాలి. 
 
9. నైవేద్యం: బెల్లం ముక్క మొదలుకొని, అరటిపండు, కొబ్బరికాయ, రసం గల పండ్లు, ఎండుపండ్లు, ప్రత్యేక పూజలలో అయితే నవకాయ పిండివంటలను నివేదించాలి. ఆ సమయంలో గాయత్రీ మంత్రాన్ని చదువుతూ, ‘నైవేద్యం సమర్పయామి’ అంటూ ఆ పదార్థాల మీద లేదా పండ్ల మీద నీటిని చల్లి, భగవంతునికి చూపుతూ, దైవానికి స్వయంగా మనమే తినిపిస్తున్నంత భక్తిశ్రద్ధలతో సమర్పించాలి. 
 
10. తాంబూలం: నైవేద్యానంతరం దక్షిణతో కూడిన తాంబూలాన్ని ‘తాంబూలాన్ సమర్పయామి’ అంటూ సమర్పించాలి.