రామప్ప దేవాలయము!!

0



రామప్ప దేవాలయము!!

ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు.

విష్ణువు ఆవతారము రాముడు మరియు శివుడు కలిసి ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉంది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము ఉంది.

ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్తంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు.

ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది.[2] దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.[3] ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది.

ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది. ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ శతాబ్దములో వచ్చిన భూకంపము వలన కొద్దిగా శిథిలము అయ్యింది. ఆలయ ముఖ ద్వారము శిథిలమైపోయింది.