షోడశ సంస్కారం

0lord-ganesha-shivaఓ ప్రాణిగా ఈ లోకంలో జీవించాల్సి ఉన్నపుడు ఏయే  నియమాలు, ఏయే నిబంధనలు అవసరమో వాటిని తెలియజేయాల్సిన అవసరంలేదా  ఆ సృష్టి  కర్తయైన బ్రహ్మకి. 
     అందుకే ఆ బ్రహ్మ మనల్ని సృష్టించాగానే, స్ధితికర్త (మనం జీవించి ఉన్నకాలం మొత్తంలో రక్షించి పోషించవలసిన బాధ్యత కలవాడు ) అయిన మహావిష్ణువు  – మనం ఎలా జీవించాలో , ఎలా జీవిస్తే అది ధర్మబద్ధమవుతుందో  ఆ యా విధానాలని మనకి ప్రజాపతుల ద్వారా  తెలియజేయించాడు . 

ప్రజాపతులు 
 ‘జ ‘ అంటే పుట్టినది అని అర్థం . ‘ప్ర-జ’ అంటే ప్రాణం కలిగి పుట్టిన 84లక్షల జీవరాసులు అని అర్థం . ఈ అన్నిటిలోనూ మృగాలు , పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, జంతువులు……..ఇలా వీటికి ఏ తీరు నియమనిబంధనలు లేవు . 
  అవన్నీ కూడా ఒక యజమాని రక్షణలో జీవించవలసిన పరతంత్ర ప్రాణులే . 
               అయితే మనుష్య జన్మనెత్తిన వారికి మాత్రం కొన్ని పద్దతులు ఉన్నాయి . ఆ పద్దతులన్ని వ్యక్తుల్ని  సంస్కరించడానికి ఏర్పాటుచేయబడినవే . అందుకే వాటికి సంస్కారాలు అని పేరు పెట్టారు . 
        ఈ సంస్కారాలని ఏర్పాటుచేసేందుకేర్పాటు  చేయబడిన అధికారాలే ‘ప్ర-జ-పతు ‘లంటే . 
  వాళ్ళందరూ శ్రీ మహావిష్ణు ఆజ్ఞకి అనుగుణంగా కొన్ని నియమాలను ఏర్పాటుచేస్తే  అవి దాదాపుగా నలభై వరకు అయ్యాయి. 
 కాలానుగుణంగానూ  వ్యక్తుల సౌలభ్యానికి వీలుగానూ ఉండాలని అంగీరస మహర్షి వాటిని 25గా  చేస్తే , నారాయణ అవతారమైన వ్యాసుడు (వ్యాసో నారాయణో హరి ) వాటిని పదహారుగా కుదించారు . 
    ఎవరు ఎన్ని సంస్కారాలని తెలియజేసినా  అవన్నీ కూడా వేదాలకనుగుణంగానే చేశారు . 
    ఉదాహరణకి ఋగ్వేదంలో వివాహం, గర్భాదానం,అంత్యేష్టి (మరణించిన సందర్భంలో చేసే క్రియలాపం మొత్తం )మొదలైనవి కన్పిస్తే , యజుర్వేద , సామవేదాల్లో గోదానం, పుట్టినరోజు చేయవలసిన కర్మలు (ఇది తప్పు మాట కాదు . శాస్రం చెప్పిన తీరుగా చేయవలసిన పద్దతులు అనిఅర్థమ్.)…… ఇలా ఎన్నో కన్పిస్తాయి . వీటిని ఆధారంగా  చేసుకొని గౌతముడు , దక్షుడు , పరాశరుడు , మనువు, ఆపస్తంబుడు,గార్గ్యుడు , బోధాయనుడు …… ఇలా ఎందరో సంస్కార విధానాలని చెప్పారు . 
        ఇవి మనుషులకి ఎంతో  అవసరమని భావించిన వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, భారవి మొదలైన మహాకవులు  అందరు తమ తమ గ్రంధాలలో ప్రస్తావిస్తూ వచ్చారు ఆ యా  సందర్భాల్లో . 
        కాబట్టి మనం ఏ వ్యాసుడు చెప్పిన 16సంస్కారాలని ‘షోడశసంస్కారా’లని  పిలుస్తూ కొన్నిటిని విసృతంగానూ కొన్నిటిని ఏదో నామకః పాటిస్తూ ఉన్నామో  అవన్నీ కూడా  ఎవరో కల్పించి చెప్పినవి కానేకావన్నమాట. 

మొత్తం పదహారు 
 ఇంట్లో ఓ పెద్ద చెప్పిన మాటని ఇంట్లోని వారు పాటిస్తే ఆ పెద్దాయనకి ఎంత ఆనందం కలిగి , ఆ ఆచరించిన వారికి తన సంపూర్ణ వాత్సల్య అనురాగ సహాయ సహకారాలని ఇష్టంతో అందిస్తాడో , అలా  మనం కూడా ఆ మహర్షులు చెప్పిన సంస్కారాలని పాటిస్తూ ఉన్నట్లయితే పరోక్షంగా వాళ్ళ ఆశిస్సుల్ని , అనుగ్రహాన్ని పొందుతున్నట్టేనన్నమాట . 
 తమకి తోచిన తీరుగా చేసేసుకుపోతుండడం కాకుండా , యాంత్రికంగా జీవించేయడం కాకుండా వ్యక్తిని సంస్కరించేందుకు ఏర్పడిన సంస్కారాలు షోడశ (షట్ (6) + దశ (10) = షోడశ = 16). 
         ప్రసిద్దంగానూ ఎక్కువమంది ఋషులు అంగీకరించినవి గానూ కన్పించేవి ఆచరింప బడుతున్నవి  అయిన 16టిని చూస్తే  ఇలా కన్పిస్తాయి . 
1. గర్భాదానం 2.పుంసవనం 3. సీమంతం 4. జాతకర్మ 5. నామకరణం 6. అన్నప్రాశన  7. చౌలమ్  8. ఉపనయనం  9. ప్రాజాపత్యం 10. సౌమ్యము 11. ఆగ్నేయం 12. వైశ్వదేవం 13. గోదానం 14. సమవర్తనం  15. వివాహం 16. అంత్యేష్టి అని (వైదికై కర్మభిహి పున్త్యే ….చౌల మౌంజి నిబంధనై …. బ్రహ్మియం క్రియతే తను – మనుదర్మ శాస్రం ). 
       స్ధులంగా ఈ సంస్కారాల స్వరూపాన్ని చూసి నట్లయితే , గర్భాదానమంటే పురుషుడు స్రీ యందు గర్భాన్ని నిక్షేపించడమనే  ఓ ప్రక్రియ . దీనిక్కూడా ఓ పద్దతి ఉండ? అనుకొకూడదు . సత్సంతానం  కలగాలంటే ఏ యే  సమయాలు అనుకూలం? ఏవి కావు? అల సమయ నియమాలు పాటించని వారు ఎవరెవరు? ఫలితమేమిటి ?…. వంటి విషయాలన్నీ ఈ సంస్కారాన్ని గురించి వివరించేటువంటి సందర్భం లో తెలుస్తాయి . 
    సరయిన తీరులో గర్భాదానం జరగని కారణంగా దంపతులు మొదటి వారంరోజుల్లోనే విడిపోయే సందర్భలు కూడా ఉంటాయి .  
    ఇక ‘పుంసవన’ మనేది ఓ వైజ్ఞానిక ప్రక్రియ . ఓ క్షత్రియుడు అంటే రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు తనకి పురుష సంతానం గాని లేనిపక్షంలో ఆనువంశిక  రాజ్యాన్ని కోల్పోతాడు . 
            వంశోద్ధారకుడు లేని కారణంగా వంశానుగతంగా వచ్చిన ప్రతిష్టని పోగొట్టుకుంటాడు. ఆ కారణంగా తర్వాతి కాలంలో స్రీ సంతానం  కలిగినా , మొదటి సంతానంగా పురుషుడు పుట్టాలనే అభిప్రాయంతో తన భార్య గర్భం ధరించిన మూడవ నెలలో మొదటి వారంలో చేసే అద్బుత ప్రక్రియ పుంసవనం. 

 అలాగే ఒక్కో కుటుంబంలో స్రీ సంతానమే కలుగుతూ ఉండే దోరణి ఉంటుంది . వారికోసం కూడా ఈ  పుంసవనమే సంస్కారం .
      ఇక సీమంత మనేది గర్భిణికి ధైర్యాన్ని , రక్షణని కలిగించే సంస్కారం. ఎవరైనా గర్భిణిగా ఉన్నప్పుడు కొందరు స్రీలు – కాన్పులో పడాల్సిన కష్టాలని , ఎవరెవరికో జరిగినటువంటి ఇబ్బందులను , తీసుకోవలసిన జాగ్రత్త లని …… ఇలా చెప్పేస్తూ  – తీవ్ర మానసిక ఆందోళనని కలిగిస్తూ ఉంటారు ఆమెకి .
       ఈ సీమంత ఉత్సవం గర్భిణికి చెప్పలేనంత ధైర్యాన్ని , గర్భంలో ఉన్నటువంటి శిశువుకి రక్షణని కలిగిస్తుంది. అంతేకాక ఆరవనెలకి వచ్చిన గర్భిణి ఎలా మహారాణిగా ఉండాలో ఆ విషయాన్నీ కూడా చెప్తుంది.
    ఇక సంతానం కలిగినప్పుడు ఏంచేయాలో ఆ వివరాలని తెలిపేది దోషాలని, శాతులని వివరించేది జాతకర్మ సంస్కారం అయితే , ఎలాటి పేరుని ఎందుకు ఏవిధంగా పెట్టాలో తెలిపేది నామకరణ సంస్కారం. 
 మొదటిసారిగా అన్నాన్ని తినిపించడం అనే పద్దతి ఉన్న అన్నప్రాశన సంస్కారానికి (అన్న+ అశనం = అన్నాన్ని తినడం ) అన్నశానమనే పేరు కాకుండా అన్న ‘ప్రా’శనమనడంలో ఉండే విశేషమేమిటో వివరిస్తుంది . ఈ 6వ సంస్కారం . 
     ఈ తీరుగా  అన్ని సంస్కారాలు అర్ధవంతంగా ఉంటూ, వ్యక్తికీ ధైర్యాన్ని నడవడికలో చక్కని మార్పుని సమాజంలో కలుపుగోలు తనాన్ని దానధర్మా పద్ధతుల్ని వివరిస్తూ వెళ్తాయి .