Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఉగాది లుక్: ఎకరంన్నర కోల్పోయిన అందగాడి కథతో

ఉగాది లుక్: ఎకరంన్నర కోల్పోయిన అందగాడి కథతో


కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కాన్సెప్టుల్ని ఎంచుకుని నటుడిగా దర్శకరచయితగా సత్తా చాటుతున్నారు అవసరాల శ్రీనివాస్. సెన్సిబుల్ కామెడీ సున్నిత ఉద్వేగాలు ఉన్న కథల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించాడు. అందుకే ఇప్పుడు అతడు బట్ట తల కాన్సెప్ట్ తో మరో విభిన్నమైన ప్రయత్నం చేస్తున్నాడు అనగానే ఒకటే ఆసక్తి నెలకొంది.

101 జిల్లాల అందగాడు అన్న టైటిల్ మోషన్ పోస్టర్ ని ఇంతకుముందు లాంచ్ చేయగా అది వైరల్ అయ్యింది. టైటిల్ కి అవసరాల బట్టతల బోయ్ లుక్ కి అద్భుత స్పందన వచ్చింది. ఈ సినిమాకి స్క్రిప్టు అందించడమే గాక.. అదిరిపోయే పంచ్ డైలాగుల్ని అవసరాల అందిస్తున్నారు. దిల్రాజు- క్రిష్ జాగర్లమూడి సమర్పణలో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్- ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శిరీష్-రాజీవ్ రెడ్డి- సాయి బాబు జాగర్లమూడి నిర్మాతలు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ గొత్తి సూర్య నారాయణ అనే పాత్రలో నటిస్తున్నారు. రుహనీ శర్మ కథానాయిక.

తాజాగా ఉగాది శుభాకాంక్షలు చెబుతూ మరో కొత్త పోస్టర్ ని లాంచ్ చేసింది చిత్రబృందం. టక్కు టై తో ఫార్మల్ లుక్ లో ఇస్మార్ట్ గా కనిపిస్తున్న గొత్తి సూర్యనారాయణ గుట్టంతా ఆ అద్దంలో కనిపిస్తోంది. ఎంత దాచాలన్నా దాగనిది ఆ బట్టతల అని అందరికీ అర్థమైపోతోంది. ఎకరంన్నర కోల్పోయిన కుర్రాడి కథతో అవసరాల అద్భుతాలు చేస్తాడనే అంచనాలేర్పడుతున్నాయి.

రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ముగించి నిర్మాణానంతర పనులు సాగిస్తున్నారు. మే 7న సినిమాను విడుదల కానుంది.