బరువు గురించి క్లారిటీ ఇచ్చిన అనుష్క

0anushka-shettyఒక్కోసారి లేనిపోని వందంతులతో అసలు విషయాలు మరుగున పడిపోతుంటాయి. సంబంధిత వ్యక్తులు చెబితే గానీ నిజాలు నిగ్గుతేలవు. నటి అనుష్కది ఇదే పరిస్థితి. ఈ తరం నటీమణుల్లో కథానాయకి ప్రాధాన్యత ఉన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించిన నటి అనుష్క అని చెప్పవచ్చు. అరుంధతి చిత్రం ఆ తరహా చిత్రాలకు దారి చూపింది. కాగా అనుష్క అలా నటించిన మరో హీరోయిన్ ఓరియంటెడ్‌ చిత్రం ఇంజిఇడుప్పళగి తెలుగులో జీరోసైజ్‌ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అనుష్క తన బరువును 80 కిలోలకు పైగా పెంచుకుని నటించి త్యాగం చేసిందనే చెప్పాలి. అంత కష్టపడి నటించినా ఫలితం దక్కలేదు.

ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. అంతే కాదు తదుపరి నటించాల్సిన బాహుబలి చిత్రంపై అనుష్క బరువు ఎఫెక్ట్‌ పడింది. అయినా ఈ యోగా సుందరి బరువు తగ్గడానికి శాయశక్తులా ప్రయత్నించి కాస్త తగ్గారట. అయితే పూర్తి నాజూగ్గా మారలేకపోయారు. దీనికి కారణం ఇంజిఇడుప్పళగి చిత్రం అనే ప్రచారం జరిగింది. అంతే కాదు బాహుబలి–2లో అనుష్కను అందంగా చూపడానికి ఆ చిత్ర దర్శకుడు అధికంగా వీఎఫ్‌ఎక్స్‌ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవలసి వచ్చిందనే ప్రచారం జరిగింది. ఆ విషయం అలా ఉంచితే అనుష్క బరువు తగ్గలేకపోవడానికి అసలు నిజం వేరే ఉందట. దీని గురించి అనుష్క పెదవి విప్పారు.

ఆమె తెలుపుతూ తనకు బరువు పెరగడం, తగ్గడం పెద్ద సమస్య కాదన్నారు. ఇంతకు ముందు కూడా ఇలా చాలా సార్లు జరిగిందని చెప్పారు. అదే విధంగా బాహుబలి–2 చిత్రం కోసం చాలా వరకు బరువు తగ్గానని, అయితే సింగం–3 చిత్ర షూటింగ్‌ సమయంలో అనుకోకుండా విపత్తుకు గురవడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడి బరువు తగ్గడానికి యోగా, కసరత్తులు చేయలేకపోయానన్నారు. ప్రస్తుతం మళ్లీ శారీరక వ్యాయామం లాంటి కసరత్తులు చేస్తున్నానని, త్వరలోనే తనను స్లిమ్‌గా చూస్తారని అనుష్క పేర్కొన్నారు.