పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో శుక్రవారం కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నాయకుడు కె. కేశవరావు తెలంగాణ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ధరలపై, తెలంగాణపై చర్చించేందుకు శుక్రవారం సిడబ్ల్యుసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు. రాష్ట్రానికి చెందిన కేశవరావు, జి. వెంకటస్వామి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్, జెడి శీలం తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యను కూడా ఆహ్వానించారు.
సమావేశంలో తెలంగాణ అంశాన్ని కేశవరావు ప్రస్తావించినట్లు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చెప్పారు. అయితే ఏం మాట్లాడారనేది చెప్పడానికి ఆయన నిరాకరించారు. కేశవరావు ప్రస్తావించారు కాబట్టే ఆయనే ఏమైనా చెప్తారేమోనని నేదురుమల్లి అన్నారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ గానీ అంబికా సోనీ గానీ మాట్లాడడానికి నిరాకరించారు. తెలంగాణపై చర్చకే రోశయ్యను సమావేశానికి అహ్వానించినట్లు చెబుతున్నారు. అయితే తెలంగాణపై ఏ విధమైన చర్చ జరిగిందనేది తెలియడం లేదు.