చలికాలంలో అల్లంతో ఎన్నో ప్రయోజనాలు

0ginger-teaఅల్లం ముక్కని నోట్లో పెట్టగానే అదో రకం టేస్ట్. కారం, ఘాటు, వగరు అన్నీ కలిపిన రుచి. చాలా తక్కువమంది అది నచ్చుతుంది. అల్లాన్ని చూడగానే అయ్యబాబోయ్ వద్దంటూ వెనక్కి జరిగే వారే ఎక్కువ. అలాంటి వారి జాబితాలో మీరూ ఉంటే… ఈ కథనం చదవండి. ఎందుకంటే అల్లం చేసే మేలు ఇంతా అంతా కాదు. శరీరానికొచ్చే అనేక సమస్యలకు అల్లం ఔషధంలా ఉపయోగపడుతుంది.

శీతాకాలంలో కొందరి శరీరం అస్సలు చలిని తట్టుకోలేదు. చిగురుటాకులా వణికేస్తూ ఉంటారు. అలాంటివాళ్లు రెండు కప్పుల నీళ్లలో ఒక స్పూను అల్లం తురుముని వేసి పది నిమిషాలు వేడిచేయాలి. అనంతరం ఒక టీస్పూను తేనె కలిపి ఆ నీటిని రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. శరీరంలో వేడి పుట్టి చలిని తట్టుకునే శక్తి వస్తుంది.

దగ్గు, జలుబు వేధిస్తుంటే స్పూను తేనెలో కొన్ని చుక్కల అల్లం రసం కలిపి తాగితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. రోజుకి కనీసం రెండు నుంచి నాలుగు సార్లు ఇలా తాగాలి.

ఒళ్లు నొప్పులు బాధిస్తుంటే అల్లంతో టీ చేసుకుని రోజూ తాగండి. అల్లంటీ చేయడానికి తొక్కని తీసేసిన అల్లాన్ని నీళ్లలో వేసి పదినిమిషాలు మరిగించాలి. అనంతరం ఆ నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని మంచి ఫలితం ఉంటుంది.

కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు తరుచూ వేధిస్తుంటే అల్లం తినడం అలవాటు చేసుకోండి. అల్లాన్ని చిన్న ముక్కలుగా కోసుకుని వాటిపై ఉప్పు చల్లుకుని నమిలినా కడుపునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. లేదా రోజు వారీ ఆహారంలో ఒక అల్లం ముక్కని తినడం అలవాటు చేసుకుంటే మంచిది.

రెండు టీస్పూనుల అల్లం జ్యూస్, ఒక టీస్పూను నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి బాగా కలిపి దానిని తాగినా కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.