వర్షాకాలం.. పాదాలు జాగ్రత్త

0Rainy-Season-Feetవిపరీతమైన ఎండల తరవాత వచ్చే వర్షాకాలం శరీరానికి, మనసుకి ఎంతో హాయిని కలిగిస్తుంది. అలాగే రోగాలను కూడా తెచ్చిపెడుతుంది. రోగాల విషయం పక్కనపెడితే.. వర్షాకాలంలో పాదాలు పాడైపోతాయని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. బురద నీటిలో నడవడం వల్ల, వర్షపు నీటిలో పాదలు నానడం వల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వస్తుందని భయపడుతుంటారు. నిజమే.. వానాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోపోతే పాదాల పాడవడంతోపాటు, చర్మ వ్యాధులు కూడా వస్తాయి. అందుకే ఈ సీజన్‌లో పాదాల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. మరి వర్షాకాలంలో మీ పాదాలు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

✓ వర్షాకాలంలో వీలైనంత వరకు షూస్ ధరించకూడదు. ఎందుకంటే వర్షంలో తడిసినపుడు లేదా వర్షపు నీటిలో నడిచినపుడు షూస్ బాగా తడిసి పాదాలకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి షూస్ కాకుండా తేలికగా ఉండే స్లిప్పర్స్, శాండిల్స్ వేసుకోవాలి.

✓ మీరు వర్షంలో తడిసినా, వర్షపు నీటిలో నడిచినా ఇంటికి రాగానే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం తడి లేకుండా తుడుచుకోవాలి. ముఖ్యంగా కాలివేళ్ల మధ్య తడి ఉండకూడదు.

✓ రాత్రి పడకునే ముందు పాదాలకు మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. మాయిశ్చరైజర్ అందుబాటులో లేకపోతే ఆలివ్ లేదా ఆల్మండ్ ఆయిల్‌ను రాసుకోవచ్చు. వేళ్ల మధ్య వీటిని రాయకపోతే మంచిది.

✓ వారానికి ఒకసారి ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవాలి. ఒక చిన్న టబ్‌లో గోరు వెచ్చటి నీళ్లు వేసి.. దానిలో నిమ్మరసం, హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలిపి అందులో పాదాలు పెట్టాలి. స్క్రబ్బర్‌తో పాదాలను శుభ్రం చేసుకోవాలి. గోర్లను శుభ్రం చేసుకోవడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించవచ్చు. తరువాత పాదాలను తడి లేకుండా తుడిచి మాయిశ్చర్‌ను అప్లై చేయాలి.

✓ వర్షాకాలంలో పాదాలకు పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పాదాలకు ఉన్న మృతచర్మం తొలగిపోయేలా స్క్రబ్బర్‌తో రుద్దాలి. డెడ్ స్కిన్‌ను తొలగిస్తే పాదాల పగుళ్లను అరికట్టినట్టే.

✓ ఇక డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు పాదాల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకితే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి.