వీర్య వృద్ధికి మార్గాలు

0

spermకొంత మందికి పెళ్లై చాలా కాలం అవుతున్నప్పటికీ సంతానం కలగదు. పిల్లలు లేని వారి వేదనను మాటల్లో వర్ణించలేం. ఆడవారిలో ఉండే సమస్యలను మినహాయిస్తే.. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల సంతానం కలగడం ఆలస్యం అవుతుంది. ఒక మిల్లీ లీటర్ స్పెర్మ్‌లో 15 మిలియన్లకు పైగా శుక్ర కణాలు ఉన్నప్పుడే పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. అంత కంటే తక్కువగా ఉంటే.. పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్‌ను పెంచుకోవచ్చు.

వృషణాలు వేడెక్కడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత కంటే వృషణాల వద్ద వేడి తక్కువగా ఉండటం కోసమే అవి శరీరం నుంచి కాస్త దూరంగా ఉంటాయి. కానీ బిగుతైన లోదుస్తులు ధరించడం వల్ల అవి వీర్య కణాలను పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయలేవు. కాబట్టి నిద్రకు ఉపక్రమించే ముందు అండర్‌వేర్ లేకుండా చూసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు పొడవుగా, బిగుతుగా ఉండే ప్యాంట్లకు బదులు వదులుగా, చిన్నగా ఉండే షార్ట్స్ ధరించడం మంచిది. అలాగే మరీ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయకూడదు. ఆటలు ఆడేటప్పుడు వృషణాలకు దెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలి.

రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయడంతోపాటు.. హెర్బ‌ల్ ఆయిల్స్‌తో బాడీ మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తి అవుతుంది.

ఒత్తిడి వల్ల సెక్స్ సామర్థ్యం దెబ్బతినడంతోపాటు వీర్య ఉత్పత్తి కూడా తగ్గుతుంది. రోజుకు 12 గంటలపైగా పనిచేసేవారికి విశ్రాంతి తక్కువగా లభిస్తుంది. అలాంటి వారు రిలాక్సేషన్ టెక్నిక్‌లను పాటించాలి. యోగా, మెడిటేషన్ చేయాలి. లేదంటే రన్నింగ్, స్విమ్మింగ్ చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఒత్తిడి ప్రభావం టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి ఉంటుంది. ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు వీర్య ఉత్పత్తి చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ఒత్తికి దూరంగా ఉండాలి. రాత్రిపూట సరిపడినంతగా నిద్రించాలి. నిద్రలేమి వల్ల కూడా వీర్య ఉత్పత్తి తగ్గుతుంది.

పొగ తాగే అలవాటు ఉన్నవారు వెంటనే దాన్ని మానుకోవాలి. సిగరెట్ తాగని వారితో పోలిస్తే.. తాగే వారిలో 22 శాతం మందిలో వీర్యం తక్కువగా ఉత్పత్తి అవుతున్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి.

ఆల్కహాల్ తీసుకునే అలావాటు ఉన్నవారిలో కాలేయం పనితీరు మందగిస్తుంది. దీని వల్ల ఈస్ట్రోజన్ స్థాయులు పెరుగుతాయి. రోజుకు రెండు పెగ్గులు తాగే వారిలోనూ వీర్యం ఉత్పత్తి తగ్గుతుంది.

ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనేవారు లేదా వీర్యస్ఖలనం చేసేవారిలోనూ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. రోజులో మిలియన్ల సంఖ్యలో వీర్యం ఉత్పత్తి అయినప్పటికీ.. ఎక్కువ సార్లు స్ఖలనం అవ్వడం వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి తక్కువసార్లు స్ఖలనం అయ్యేలా చూసుకోవాలి. రోజుకు రెండుసార్లు సెక్స్‌లో పాల్గొనే బదులు గ్యాప్ తీసుకోవాలి.

కెమికల్స్, టాక్సిన్ల కారణంగానూ వీర్యం పరిమాణం, కదలికలో మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.

కొన్ని రకాల మందులు వీర్యం ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అవి వ్యంధత్వానికి కూడా దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి మందులు వాడేటప్పుడు తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాలి.