Templates by BIGtheme NET
Home >> Telugu News >> హెచ్ డీఎఫ్ సి కి బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ !

హెచ్ డీఎఫ్ సి కి బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ !


దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కు షాక్ తగిలింది. బ్యాంక్ కొత్తగా క్రెడిట్ కార్డుల జారీతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవల ప్రారంభంపై ఆర్బీఐ తాతాల్కిక నిషేధం విధించింది. గడిచిన రెండేళ్లకు పైగా కాలంలో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఆన్ లైన్ సేవలకు పలుమార్లు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల 21న హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ఇతర చెల్లింపులతో పాటు డిజిటల్ విభాగ సేవలన్నీ ఉన్నట్టుండి ఆగిపోయాయి. దాంతో బ్యాంక్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2018 డిసెంబరులో బ్యాంక్ ప్రారంభించిన కొత్త మొబైల్ అప్లికేషన్ కొద్ది గంటలకే క్రాష్ అయింది.

సరిగ్గా సంవత్సరం తర్వాత ఖాతాదారుల అకౌంట్లలో జీతాలు జమయ్యే సమయంలో బ్యాంక్ ఆన్ లైన్ చానళ్లన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచే బ్యాంక్ ఆన్ లైన్ సేవల అంతరాయాలపై ఆర్బీఐ దృష్టి సారించింది. సాధారణంగా ఆర్ బీఐ ఈ తరహా వైఫల్యాలకు బ్యాంక్ లపై నగదు జరిమానాలు విధిస్తుంటుంది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ విషయంలో మాత్రం మరిన్ని సేవలందించకుండా నిషేధించడం గమనార్హం.

గత నెలలో సేవల అంతరాయానికి తమ ప్రైమరీ డేటా సెంటర్లో విద్యుత్ వైఫల్యమే కారణమని హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ తెలిపింది. ఈ నేపథ్యంలో డిజిటల్ 2.0 ప్రణాళికలో భాగంగా కొత్త సేవల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్ బీఐ నిర్దేశించిందంటూ గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు బ్యాంక్ సమాచారం అందించింది. అంతేకాదు మరిన్ని ఐటీ అప్లికేషన్లను ఉపయోగించాల్సిన సేవలతో పాటు కొత్తగా క్రెడిట్ కార్డుల జారీని సైతం నిలిపివేయాలని ఆదేశాలందాయని బ్యాంక్ తెలిపింది. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ కు 1.49 కోట్ల క్రెడిట్ కార్డు కస్టమర్లు 3.38 కోట్ల డెబిట్ కార్డు ఖాతాదారులున్నారు.