భారత్‌మాతాకీ జై కాదు..అంబానీ కీ జై నీరవ్ కీ జై అనండి!

0

తెలంగాణలో పోలింగ్ జరిగే రోజే అటు రాజస్థాన్ ప్రజలు కూడా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు ప్రధాని మోడీ మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈ ప్రచార పర్వంలో పాల్గొంటున్న సందర్భంగా తన ప్రసంగాల వాడి పెంచుతున్నారు. రాజస్థాన్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరిన సమయంలో తాజాగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో మోడీ లక్ష్యంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. సభలో చాలా ఆవేశంగా ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మోడీ ప్రతి సభలో మాట్లాడే ముందు భారత్‌మాతా కీ జై అంటారు.. దానికి బదులు అనిల్ అంబానీ కీ జై నీరవ్ మోదీ కీ జై మెహుల్ చోక్సీ కీ జై అనండి. భారత మాత గురించి మాట్లాడుతున్నపుడు మీరు రైతుల గురించి ఎలా మరచిపోతారు?“ అని రాహుల్ ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా రైతుల్లో నెలకొన్న నిరాశా నిస్పృహలకు కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రధాని మోడీ రెండు దేశాలను ఏర్పరుస్తున్నారని.. వాటిలో ఒకటి అనిల్ అంబానీ కోసం రెండోది రైతుల కోసమని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన రైతు 750 కిలోల ఉల్లిగడ్డను కేవలం రూ.1040కి అమ్ముకున్నట్టు వచ్చిన వార్తను రాహుల్ ప్రస్తావిస్తూ “మోడీజీ రెండు హిందుస్థాన్లను రూపొందిస్తున్నారు. ఒక హిందుస్థాన్ అనిల్ అంబానీ కోసం.. ఆయన ఒక్క విమానం కూడా తయారు చేయకుండా మోడీజీ నుంచి రూ.30వేల కోట్ల రాఫెల్ కాంట్రాక్ట్‌ను పొందారు. రెండో హిందుస్థాన్ రైతుల కోసం రూపొందిస్తున్నారు. ఆ దేశంలో రైతులు నాలుగు నెలల పాటు కష్టపడి 750 కిలోల ఉల్లిగడ్డను పండిస్తే.. వారికి మోడీజీ ఇచ్చింది రూ.1040“ అని రాహుల్ మండిపడ్డారు. మోడీ సర్కార్ విధానాల వల్లనే రైతులు నిరాశా నిస్పృహలకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. మోడీ ఎక్కడా రాఫెల్ డీల్ గురించి మాట్లాడటం లేదని ఒకవేళ మాట్లాడితే ప్రజలు ఎక్కడ కాపలాదారే దొంగయ్యాడు అంటారేమో అని భయపడుతున్నారని రాహుల్ విమర్శించారు.
Please Read Disclaimer