ఏపీ టాలీవుడ్.. జగన్ కోసం వెయిటింగ్!!

0

బీచ్ సొగసుల విశాఖ నగరంలో మరో కొత్త సినీపరిశ్రమ పాదుకోనుందా? అందుకు సువిశాలమైన బీచ్ పరిసరాల్లో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే పాజిటివ్ సంకేతాలు అందుతున్నాయి. కొత్త ప్రభుత్వం.. కొత్త గాలి ఏపీ- గ్లామర్ ఇండస్ట్రీకి సంకేతం అన్న మాట ప్రముఖంగా సినీవర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవానికి ఏపీ టాలీవుడ్ అన్నది.. ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ డివైడ్ తర్వాత వెంటనే చర్చకొచ్చిన పాయింట్ ఇది. ఫిలింఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి తరలించాల్సిన అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ కి ఓ గ్లామర్ పరిశ్రమ అవసరం ఉంది. రాష్ట్రానికి గ్లామర్ అద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని సినీపెద్దలంతా బలంగా భావించారు. ఏపీ ఇండస్ట్రీ నుంచి వసూలయ్యే పన్నులన్నీ కచ్ఛితంగా ఆ ప్రభుత్వానికే చెందేలా వెంటనే ఓ కొత్త ఎజెండాని రూపొందించాలని భావించారు. అయితే గత ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు పైన పటారం – లోన లొటారం తరహాలో సినీపరిశ్రమను అవసరానికి వాడి విసిరేసారన్న వాదన ఆయన పాలనలో ఉన్నప్పుడే బలంగా వినిపించింది. ఏదో హడావుడి చేయడం తప్ప పనులు చేసిందేమీ లేదన్న వాదనా వినిపించారు. రాజధానిపై పెట్టిన శ్రద్ధ ఇక దేనిపైనా పెట్టలేదని సినిమావోళ్లు వాపోయారు. అంతేకాదు… సినిమావోళ్లను ఆకులో వక్కలా అవసరానికి ఉపయోగించుకునే ప్రభుత్వం తేదేపా ప్రభుత్వం అని పలువురు ఇండస్ట్రీ పెద్దలు పలుమార్లు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు సినీపెద్దలు పూర్తి వ్యతిరేకంగా పని చేయడం వెనక చాలా పెద్ద కథే ఉందని చెబుతున్నారు.

చంద్రబాబుతో ఏం మాట్లాడినా చేద్దామంటారు. కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాదన్న వాదన సినీపరిశ్రమ ప్రముఖుల్లో ప్రముఖంగా వినిపించింది. ఆ క్రమంలోనే బాబు వల్ల పని కాదని భావించిన టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాత (50 ఏళ్ల కెరీర్ నడిపారు) సరిగ్గా రెండేళ్ల క్రితం వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ కి అత్యంత సమీపంలో ప్రయివేటుగా ఓ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ ఎన్ సీసీ) ని ప్రారంభించి యాక్టివిటీస్ ని ప్రారంభించారు. ఇందులో ఇప్పటికే 200 మంది సభ్యులు చేరారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ క్లబ్ యాక్టివ్ గా ఉంది. అక్కడ స్థానికంగా సినిమాల నిర్మాణం పెరిగేందుకు ఈ క్లబ్ కృషి చేస్తోందని సమాచారం. ఇక ఇప్పటికే వైజాగ్ లో ఓ చోట సినీ ఔత్సాహికులంతా కలిసి ఓ ఫిలింఛాంబర్ ని ఏర్పాటు చేసుకున్నారని ఇదివరకూ ప్రచారం సాగింది. పలు అసోసియేషన్ల వాళ్లు వైజాగ్ కేంద్రంగా హౌసింగ్ స్కీమ్స్ ప్లాన్ చేయడం కూడా చర్చకొచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. వైజాగ్ బీచ్ పరిసరాల్లో రామానాయుడు స్టూడియోస్ ని ఆనుకుని ఉన్న కొండ అంచున కొన్ని ఎకరాల్లో వైజాగ్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (వీఎఫ్ఎన్ సీసీ) నిర్మాణానికి ప్రభుత్వమే శ్రీకారం చుట్టబోతున్నారని తెలిసింది. ఇప్పటికే ఏపీ గవర్నమెంట్ అక్కడ స్థలం కేటాయించింది. నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతుందన్న సమాచారం అందింది.

బీచ్ రోడ్ లో రామానాయుడు స్టూడియోస్ పరిసరాల్లోనే కొన్ని స్టూడియోల నిర్మాణానికి ఇదివరకూ ఏపీఎఫ్డీసీ అధికారికంగా కొన్ని దరకాస్తుల్ని పరిశీలించింది. అందులో సినీనటుడు బాలకృష్ణ సహా ఏవీఎం స్టూడియోస్ నుంచి దరకాస్తులు పరిశీలనకు వచ్చాయి. భీమిలికి కూతవేటు దూరంలోనే ఈ మొత్తం సెటప్ ఉంది. వైజాగ్ – అరకు.. వైజాగ్ – గోదావరి కారిడార్ ని లొకేషన్ల క్లస్టర్ (3 గంటల ప్రయాణ దూరం) గా భావించి సినిమాల నిర్మాణం పెరిగేందుకు ప్రస్తుత కొత్త గవర్నమెంట్ కృషి చేస్తుందని పలువురు పెద్ధలు వైకాపా అధినాయకుడు వైయస్ జగన్ గెలిచిన వెంటనే వ్యాఖ్యానించారంటే సన్నివేశం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జగనన్న వచ్చాడు.. చంద్రన్నలా కాకుండా మరో కొత్త ఇండస్ట్రీని డెవలప్ చేస్తాడని ఆంధ్ర- వైజాగ్ ప్రజల్లోనూ హోప్ కనిపిస్తోంది. దీనిపై మరోసారి హైదరాబాద్ పరిశ్రమలోనూ వాడి వేడి చర్చ సాగుతోంది. అప్పుడు బాబు మాటలకే పరిమితమయ్యారు.. చేతల్లో ఏదీ చేయలేదు. చంద్రబాబు చేయనిది కొత్త సీఎం జగన్ చేస్తారనే భావిస్తున్నామని పలువురు ఫిలింఛాంబర్ పెద్దలు వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. గ్లామర్ ఇండస్ట్రీ నుంచి 2500 కోట్ల ప్రత్యక్ష పన్ను వసూలవుతుంది. అది ఏపీ ప్రభుత్వానికి చెందాలంటే కచ్ఛితంగా ఓ కొత్త ఇండస్ట్రీ రూపకల్పనకు శ్రీకారం చుట్టాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ మేరకు కొత్త సీఎం జగన్ చొరవ తీసుకోవాలని పలువురు సినీపెద్దలు సూచిస్తున్నారు. అన్నట్టు ఏపీకి గ్లామర్ ఇండస్ట్రీ అవసరం లేదని అనుకునేవాళ్లున్నారా? అంటే.. ఏపీ ప్రభుత్వానికి పన్నుల ఆదాయం అక్కర్లేదా? అని ప్రశ్నించిన వాళ్లు ఉన్నారు. మరి వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక .. ఏపీ టాలీవుడ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer