శివరాజ్ చౌహాన్‌కు బీజేపీ షాక్.. ప్రతిపక్షనేతగా భార్గవ

0

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కాగా హుందాగా వ్యవహరించి ప్రజల మన్ననలు పొందారు మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. సీఎం అయ్యేందుకు కేవలం కొన్ని సీట్లు అవసరం కాగా ప్రయత్నాలు చేద్దామా అన్న పార్టీ నేతల సలహాకు ప్రజలు మనకు తీర్పు ఇవ్వలేదని సూచించారు. కానీ ఎన్నికల తర్వాత నేడు (జనవరి 7న) మధ్యప్రదేశ్ శాసనసభ సమావేశమైంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల పేర్ల ఖరారు కోసం బీజేపీ ఎమ్మెల్యేలతో సోమవారం ఉదయం ఆ పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది.

సభ్యుల ప్రమాణం తర్వాత ప్రతిపక్షనేతగా శివరాజ్‌సింగ్‌ను ఎన్నికుంటారని అంతా భావించారు. ఎనిమిదో సారి ఎమ్మెల్యేగా గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టిన గోపాల్ భార్గవను బీజేపీ పక్షనేతగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. శివరాజ్ చేతనే స్వయంగా ఈ పేరును ప్రతిపాదించేలా అధిష్టానం పావులు కదిపింది. ప్రజాధరణ పొందిన నేత, ఇతర పార్టీలు సైతం గౌరవించే నేత శివరాజ్‌ను కాదని ఆరెస్సెస్ భావజాలం ఉన్న భార్గవకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. స్పీకర్‌గా విజయ్ షాను బరిలోకి దింపాలని కూడా పార్టీ నిర్ణయించింది.

బుందేల్ ఖండ్, సాగర్ జిల్లాలోని రెహ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు భార్గవ. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ప్రతిపక్షనేతగా భార్గవ పేరును అధికారికంగా ప్రకటించారు. సంప్రదాయం ప్రకారం అత్యంత సీనియర్ నేతను ప్రొటెం స్పీకర్‌గా నియమించి ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించాలి. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన దీపక్ సక్సేనాను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. గోటేగావ్ శాసనసభ్యుడు, కాంగ్రెస్ నేత ఎన్‌పీ ప్రజాపతి స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలుచేశారు. స్పీకర్ పదవికి అవసరమైతే మంగళవారం (జనవరి 8న) పోటీ నిర్వహిస్తారు.

కాగా, తాజా ఎన్నికల్లో 230 స్థానాలకు గాను కాంగ్రెస్ 114 సీట్లు సొంతం చేసుకుంది. బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందింది. బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కే మద్దతు తెలపడంతో శివరాజ్ మరో ఆలోచన పెట్టుకోకుండా తన పదవివకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
Please Read Disclaimer