బాబు సంచలనం!..ఏపీకి తెలంగాణ బాకీ

0

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీలో అధికార పార్టీ టీడీపీ సంచలన ప్రకటనలు చేస్తోంది. రాజకీయంగా ఇప్పటికే ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డ టీడీపీ అధినేత – ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ఎన్నికలకు నగారా మోగిన వేళ… తెలంగాణ రాష్ట్రంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి తెలంగాణ ఏకంగా లక్ష కోట్ల మేర బాకీ పడిందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఇప్పటిదాకా ఈ తరహా కామెంట్లు చేయని చంద్రబాబు… సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ మాటను ప్రస్తావించి సంచలనం రేపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష వైసీపీకి మద్దతుగా టీఆర్ ఎస్ వ్యవహరించనునందన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఈ ప్రకటన ఆసక్తి రేకెత్తిస్తోంది. నేటి మధ్యాహ్నం అమరావతిలో మీడియా సమావేశం పెట్టిన చంద్రబాబు… తెలంగాణ అప్పులతో పాటు ఆ రాష్ట్రం ఏపీకి చేస్తున్న అన్యాయాలపైనా బాబు తనదైన శైలి ఆరోపణలు చేశారు.

ఈ దిశగా చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్న విషయానికి వస్తే… విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి రూ. లక్ష కోట్లు రావాలని చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఆస్తులు – భవంతులు.. ఇలా అన్ని కలిపి ఏపీకి పెద్ద మొత్తంలో తెలంగాణ నుంచి రావాల్సి ఉందని చెప్పారు. అయితే ఈ విషయం బయటకు రానీయకుండా… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుపెట్టుకొని కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏపీకి రూ.500 కోట్ల సాయం చేద్దామని కేసీఆర్ భావించారని గతంలో చెప్పారని ఇప్పుడు జగన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రూ.వెయ్యి – రూ.2వేల కోట్లు ఇస్తున్నారని – ఇలా ఇచ్చి ఏపీలో చక్రం తిప్పుదామని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. తద్వారా మనకు రావాల్సిన లక్ష కోట్లను ఎగ్గొట్టేందుకే కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఏపీలో టీడీపీ వంటి సరైన ప్రభుత్వం ఉంటే తమకు నష్టమని కేసీఆర్ భావిస్తున్నారని – అందుకే జగన్ ను గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తనను దెబ్బతీసేందుకే కేసీఆర్ – మోడీ – జగన్ కలిసి తొలి విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని – కానీ దీనిని తాను అవకాశంగా మలుచుకుంటానన్నారు. జగన్ చేసిన వందల ఎకరాల ఆక్రమణలు కేసీఆర్ కు కనిపించడం లేదని ఆని చంద్రబాబు నిలదీశారు. తమ పార్టీ డేటా దొంగిలించి తిరిగి తమనే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమ పార్టీ డేటా దొంగిలించి అడ్డంగా దొరికిపోయారని తెరాసపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రయోజనాలకు కేసీఆర్ అడ్డుపడుతున్నారని – రాష్ట్ర ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం ఏపీలో ప్రచారం చేస్తోందని జగన్కు ఓటేస్తే కేసీఆర్ కు ఆయన ఊడిగం చేస్తారని చంద్రబాబు దుయ్యబట్టారు. మొత్తంగా ఎన్నికల వేళ… ఏపీకి తెలంగాణ కట్టాల్సిన అప్పు లక్ష కోట్లన్న విషయాన్ని ప్రస్తావించి చంద్రబాబు కొత్త కలకలం రేపారని చెప్పాలి.
Please Read Disclaimer