అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్.. గురువారం భూమిపూజ

0

ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ గురువారం ఉదయం 8 గంటలకు భూమి పూజ జరగనుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు, ఫారూఖ్, కిడారి శ్రవణ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం నిర్వహించే సభకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ హోదాలో బాలకృష్ణ అధ్యక్షత వహిస్తారు. 

బుధవారం తుళ్లూరు వెళ్లిన నందమూరి బాలకృష్ణ హాస్పిటల్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. భూమి కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారు. ఈ హాస్పిటల్‌ను వెయ్యి పడకలతో మూడు దశల్లో నిర్మించనున్నారు. ఈ హాస్పిటల్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం తుళ్లూరులో 15 ఎకరాలు కేటాయించింది.

ఎన్టీఆర్ భార్య బసవ తారకం క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆమె పడిన ఇబ్బందులు మరొకరు పడొద్దనే తపనతో హైదరాబాద్‌లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు అంకురార్పణ చేశారు. 2000లో నాటి ప్రధాని వాజ్‌పేయి చేతుల మీదుగా హైదరాబాద్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి తక్కువ ఖర్చుతోనే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య ఖర్చులు చెల్లించే స్థోమత లేని వారికి ఉచిత వైద్యంతో పాటు కార్పస్‌ ఫండ్‌ ద్వారా ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. గత ఏడాది జూలైలో విజయవాడలోని సూర్యరావు పేటలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. వారంలో రెండు రోజులపాటు డాక్టర్లు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. 
Please Read Disclaimer