‘అమ్మఒడి’ రూ.15,000 అందరికా.. కొందరికా?

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై పట్టుబిగించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఒకవైపు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూనే.. మరోవైపు వేగవంతమైన నిర్ణయాలతో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు.

‘నవరత్నాలు’ అమలే ప్రధాన అజెండాగా ముందుకు కదులుతున్నారు. ఈ నవరత్నాల్లో అమ్మఒడి పథకం కూడా ఒకటి. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15,000 ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జనవరి 26 నుంచి ఈ స్కీమ్‌ను అమలు చేయనుంది.

అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. వైఎస్సాఆర్సీపీ మేనిఫెస్టో గమనిస్తే.. ఇందులో ‘పిల్లల చదువుకు ఏ పేదింటి తల్లీ భయపడొద్దు. పిల్లలను బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15,000 ఇస్తాం’ అని ఉంది. అంటే ప్రభుత్వం పేదలకు మాత్రమే ఈ స్కీమ్‌ను వర్తింపజేసే అవకాశముంది.

అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే వర్తింపజేస్తారా? లేకపోతే ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింపజేస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్దఎత్తునే చర్చ జరుగుతోంది. నెటిజన్లు ఎక్కువ మంది ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే ఈ స్కీమ్ వర్తింపు జేయాలని కోరుకుంటున్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా అమ్మ ఒడికి సంబంధించి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌పై కూడా నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇది మంచి పథకమని అందరూ మెచ్చుకుంటున్నారు. అదేసమయంలో కేవలం ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే ఈ స్కీమ్‌ను వర్తింపజేయాలని కొత్త సీఎంను కోరుకుంటున్నారు.
Please Read Disclaimer