బాబుపై అనుచిత వ్యాఖ్యలు.. పోసానికి ఈసీ నోటీసులు!

0

‘ముఖ్యమంత్రి గారు.. మీరు మాట ఇచ్చారు’ పేరుతో నటుడు పోసాని కృష్ణమురళి తెరకెక్కించిన చిత్రాన్ని నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌ను టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ సినిమాను ఆపేయాలని పోసానికి లేఖ రాసింది. ఈసీ లేఖపై అసహనం వ్యక్తం చేసిన ఆయన చంద్రబాబుపై నోరు జారారు. దీంతో ఆయనకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సీఎం చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోసానిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం నటుడికి నోటీసులు పంపింది. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

ఈసీ నోటీసులకు స్పందించిన పోసాని ఓ లేఖ రాశారు. చంద్రబాబుపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అందులో వివరణ ఇచ్చారు. అంతేకాదు, తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, విచారణకు ఇప్పుడు హాజరు కాలేనని తెలిపారు. నడవలేని స్థితిలో ఉన్న తాను ఆపరేషన్ కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరానని లేఖలో పోసాని వెల్లడించారు.

రెండు రోజుల కిందట మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోసాని ‘చంద్రబాబు పెద్ద దొంగ. వెన్నుపోటు పొడుస్తాడు. కులాలను కించపరుస్తూ దూషిస్తాడు. ఇవన్నీ జనాలకు తెలుసు. ఏం తెలియదని బాబును టార్గెట్‌ చేసే సినిమా తీయాలి? ఆయన తప్పులు చేయొచ్చు.. కానీ నేను సినిమా తీయకూడదా?’ అంటూ ప్రశ్నించారు. ‘పవన్ కళ్యాణ్ వల్లే గతంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు పవన్‌ను, ఆయన కుటుంబసభ్యులను తిడుతున్నారని’ అన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై కూడా స్పందించిన పోసాని బాబునుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ‘ఎన్టీఆర్‌నే చంపిన వ్యక్తికి జగన్‌ ఓ లెక్క కాదు. నోట్లో నుంచి లింగాలు తీసినట్టు… చంపుతారు… లెటర్లు సృష్టిస్తారు..’ అని ఆరోపించారు.
Please Read Disclaimer