ప్రచారంలో లోకేశ్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం

0

మంత్రి నారా లోకేశ్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన లోకేశ్, ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తుండగా పై నుంచి హోల్డింగ్ పడింది. అయిదే, ఆ బోర్డు కాస్తా ఆయనకు దూరంగా పడటంతో నేతలు ఎవరూ గాయపడలేదు. మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న టీడీపీ నేత, మంత్రి నారా లోకేశ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి నిడమర్రులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సద్గుణ టిఫిన్ సెంటర్ వద్ద లోకేశ్ మాట్లాడుతుండగా అక్కడ హోటల్ బోర్డు కుప్పకూలింది. లోకేశ్ సహా మిగిలిన నేతలంతా దానికి దూరంగా ఉండటంతో అది కార్యకర్తల మీద పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో లోకేశ్‌తోపాటు గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ సహా ముఖ్య నేతలు కూడా ఉన్నారు.

అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో లోకేశ్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తూ అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాపీ పట్టి భవన నిర్మాణ కార్మికులతో కాసేపు సరదాగా గడిపారు. ఇస్త్రీపెట్టె పట్టుకొని బట్టలు ఇస్త్రీ చేశారు. కూరగాయల మార్కెట్‌లో మహిళలతో ముచ్చటించారు. స్కూల్ విద్యార్థులతోనూ లోకేష్ ముచ్చటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్దిపొందిన ఆనందం, సంతృప్తి ఇక్కడ ప్రతి ఒక్కరిలో కనిపించిందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతకముందు టీడీపీలో చేరిన బ్రాహ్మణ సేవా సమితి సభ్యులకు పసుపు కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Please Read Disclaimer