క్రిమినల్స్ తో మన విద్యార్థులు..అమెరికాలో కలకలం..

0

అమెరికా అధికారులు చేసిన స్టింగ్ ఆపరేషన్ కారణంగా విచారణ ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థుల విడుదలపై ఉత్కంఠ కొనసాగుతున్నది. దాదాపు పదిరోజులు గడుస్తున్నప్పటికీ – విద్యార్థులు డిటెన్షన్ సెంటర్లలోనే మగ్గుతున్నారు. విద్యార్థులకు సౌకర్యాలు – పరిస్థితుల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదనే వార్తలు వస్తున్నప్పటికీ.. తల్లిదండ్రుల్లో ఆందోళన కొనసాగుతున్నది. విచారణ మొదలైన తర్వాత న్యాయమూర్తుల నిర్ణయం అనంతరమే వారి విడుదలపై స్పష్టత రానున్నట్లు సమాచారం. విద్యార్థులను న్యాయమూర్తుల ఎదుట ప్రవేశపెట్టే ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే ఈ విచారణలో భౄగంగా విద్యార్థులను క్రిమినల్స్ తో కలిపి ఉంచడం కలకలం సృష్టిస్తోంది.

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై అగ్రరాజ్యం కఠినచర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరెవరు తప్పుడు పత్రాలతో – గడువు ముగిసిన వీసాలతో అమెరికాలో నివసిస్తున్నారో గుర్తించేందుకు అమెరికా ప్రభుత్వం అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ (హెచ్ఎస్ఐ) అధికారులు 2015లోనే డెట్రాయిట్లోని ఫర్మింగ్ టన్ హిల్స్ లో ఒక చిన్న భవంతిలో ఫర్మింగ్ టన్ యూనివర్సిటీ పేరిట ఒక నకిలీ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. దానికి ప్రభుత్వ గుర్తింపు ఉందని వర్సిటీ వెబ్ సైట్ లో పొందుపర్చారు. వాస్తవానికి ఈ యూనివర్సిటీకి ఎలాంటి సిబ్బంది – టీచర్లు లేరు. తరగతులు కూడా నిర్వహించలేదు. అయితే.. ఇది పోలీసులు పన్నిన వల అన్న విషయం తెలియని దళారీలు.. వీసా గడువు ముగిసినవారిని తప్పుడు పత్రాలతో పెద్దసంఖ్యలో ఇందులో చేర్పించడం ద్వారా ఇమ్మిగ్రేషన్ అధికారులను బురిడీ కొట్టించబోయి.. తామే పట్టుబడ్డారు. సదరు దళారీలు డబ్బులు తీసుకుని (పే టు స్టే) అడ్మిషన్లు ఇప్పిస్తున్నట్టు అమెరికా పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ ఎపిసోడ్ వల్ల అనేక మంది విద్యార్థులు విచారణను ఎదుర్కుంటున్నారు. కాగా బాధితుల్లో అత్యధికులు తెలుగువారే.

అయితే వీరిని ఉంచిన డిటెన్షన్లలో క్రిమినల్స్ తో కలిపి ఉంచడం కలకలంగా మారింది. హత్యలు – మానభంగాలు చేసిన వారితో కలిపి మన విద్యార్థులను ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. మోసపోయిన విద్యార్థులను తీవ్రమైన నేరాలు చేసిన వారితో కలిపి ఉంచడం విస్మయకరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల పలువురు భగ్గుమంటున్నారు. కాగా ఈ వార్త వెలుగులోకి రావడంతో అమెరికాలోని పలువురు విద్యార్థుల విషయంలో తగు చర్యల కోసం ముందుకు వచ్చారు. నకిలీ యూనివర్సిటీ కేసులో అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ ఎస్) చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని పలువురు అమెరికా చట్టసభ సభ్యులు డిమాండ్ చేశారు. అరస్టైన భారతీయ విద్యార్థులు తమ రాయబార కార్యాలయాల్ని సంప్రదించే అవకాశం కల్పించాలని వారికి న్యాయ సహాయం అందించేందుకు అటార్నీలను నియమించాలని కోరారు. ఈ మేరకు భారతీయ అమెరికన్ – కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి – అమెరికా చట్టసభ సభ్యులు థామస్ సౌజి – రాబ్ ఉడాల్ – బ్రెండా లారెన్స్.. హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ ఎస్) – యూఎస్ ఇమ్మిగ్రేషన్ – కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ)లకు గురువారం లేఖ రాశారు. నిర్బంధంలో ఉన్న భారత విద్యార్థుల పట్ల నిష్పక్షపాతంగా – మానవతాదృక్పథంతో వ్యవహరించాలని కోరారు. కాగా ఫిబ్రవరి 12వ తేదీ నుంచి కాన్సులర్ యాక్సెస్ కల్పించనున్నట్లు తెలుస్తోంది.
Please Read Disclaimer