నేటి నుంచి ఏపీ అసెంబ్లీ.. ముహూర్తం చూసుకుని సభలోకి జగన్!

0

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి శాసనసభ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మొత్తం ఐదు రోజులపాటు సాగే అవకాశముంది. శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకుంటారు. ప్రొటెం స్పీకర్‌ శంబంగి చిన వెంకటఅప్పలనాయుడు తొలుత శాసన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మిగతా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార ప్రక్రియ కొనసాగుతుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక గురువారం జరగనుండగా, శుక్రవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు.

జూన్ 15, 16 తేదీలు సెలవు కావడంతో మళ్లీ 17, 18 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. ఈ రెండు రోజులు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. తిరిగి జులైలో బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించనున్నారు. గత అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ ఛాంబర్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, గతంలో లోకేష్‌ కార్యాలయాన్ని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయానికి కేటాయించారు. అలాగే గత సభలో వైసీపీ శాసనసభ పక్ష కార్యాలయం, టీడీపీ శాసనసభ పక్ష కార్యాలయం, ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌కు కేటాయించిన ఛాంబర్‌లను ప్రస్తుతం వైసీపీ తీసుకుంది.

కాగా, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం 10.30 గంటలకు శాసనసభలోని తన ఛాంబర్లోకి ప్రవేశిస్తారు. వేదపండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి ఛాంబర్‌లో ఆయన ఆసీనులు కానున్నారు. అనంతరం 11.05 గంటలకు శాసనసభలోకి వస్తారు. శాసనసభ సమావేశాలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తామని, సభలో ప్రతిపక్షాన్ని తగిన విధంగా గౌరవిస్తామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం శాసనసభ ఆవరణలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 14 తర్వాత సమావేశాలు కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశాల సందర్భంగా గత ప్రభుత్వం, అప్పటి స్పీకర్‌లా వ్యవహరించకుండా సభను హుందాగా నడిపిస్తామని, ప్రతిపక్ష పార్టీ సభ్యులను గౌరవిస్తామని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల సందర్భంగా గత ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అవమానించేలా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.
Please Read Disclaimer