ఎంపీగా కేసీఆర్ పోటీ.. ఇక్క‌ణ్నుంచే!

0

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుతో దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు తీసుకురావాల‌ని యోచిస్తున్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఈ ప్ర‌య‌త్నాల్లో భాగంగానే ఆయ‌న ప‌లు పార్టీల‌తో పొత్తుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం ప్ర‌భుత్వం ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉండ‌టంతో వాటిని త‌న వైపుకు తిప్పుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాలంటే దిల్లీ వేదిక‌గా నిరంత‌రం అందుబాటులో ఉండ‌టం కీల‌కం. అప్పుడే జాతీయ స్థాయి నాయకుల‌తో, ప్రాంతీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు మంత‌నాలు సాగించ‌డం వీల‌వుతుంది. దీంతో ఎంపీగా గెల్చి దేశ రాజ‌ధానికి త‌న మ‌కాం మార్చాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. తాను పోటీ చేయ‌బోయే లోక్ స‌భ స్థానాన్ని ఆయ‌న ఇప్ప‌టికే ఎంపిక చేసుకున్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయాల‌ని యోచిస్తున్న కేసీఆర్‌.. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ ను బాగా దెబ్బ‌తీయాల‌ని కూడా భావిస్తున్నార‌ట‌. అందుకే కాంగ్రెస్ బ‌లంగా ఉన్న స్థానంలోనే బ‌రిలోకి దిగి వారిని చిత్తుగా ఓడించాల‌ని యోచిస్తున్నార‌ట‌. ఈ ప్ర‌ణాళిక‌లో భాగంగా త‌న పోటీకి న‌ల్గొండ స్థానాన్ని ఎంచుకున్నార‌ట‌.

ప్ర‌స్తుతం న‌ల్గొండ ఎంపీగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి విజ‌యం సాధించిన ఆయ‌న ఆ త‌ర్వాత టీఆర్ ఎస్ లో చేరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు గుత్తా విముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో కాంగ్రెస్ బ‌లంగా ఉంది. టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, సీనియ‌ర్ నేత జానారెడ్డి, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఈ జిల్లాకు చెందిన వారే. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి న‌ల్గొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈ ద‌ఫా ఆయ‌న ఎంపీగా పోటీ చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ‌లో మొత్తం 17 లోక్ స‌భ స్థానాలున్నాయి. వాటిలో మిత్ర‌ప‌క్షం ఎంఐఎం పోటీ చేసే ఒక్క స్థానం మిన‌హా మిగిలిన 16 స్థానాల‌ను ఎలాగైనా స‌రే చేజిక్కించుకోవాల‌ని టీఆర్ ఎస్ భావిస్తోంది. న‌ల్గొండ‌లో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి పోటీగా స్థానిక నేత‌లు ఎవ‌రు బ‌రిలో దిగినా గులాబీ ద‌ళం విజ‌యావ‌కాశాలు త‌గ్గిపోయే అవ‌కాశ‌ముంది.

అందుకే తానే స్వ‌యంగా పోటీ చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. అక్క‌డ కోమ‌టిరెడ్డిని ఓడించ‌డం ద్వారా కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టొచ్చ‌న్న‌ది కూడా కేసీఆర్ వ్యూహ‌మ‌ని తెలుస్తోంది. కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి దిల్లీ వెళ్తే సీఎం పీఠాన్ని త‌న‌యుడు కేటీఆర్ కు అప్ప‌గిస్తార‌నే ప్ర‌చారం కూడా ప్ర‌స్తుతం జోరుగా న‌డుస్తోంది. మ‌రి ఈ వార్త‌లో ఎంత‌వ‌రకు వాస్త‌వ‌ముందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే!
Please Read Disclaimer