కేసీఆర్ మీద మోడీషాలు సీరియస్ గా ఉన్నారా?

0

దివంగత మహానేత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి ఎంతలా నిప్పులు చెరిగారో గుర్తుందా? విభజన అనంతరం ఏపీలో టీడీపీతో దోస్తీ చేసిన బీజేపీ.. లెక్కలు తేడా వచ్చిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎంతలా విరుచుకుపడ్డారో తెలిసిందే. కన్నా నుంచి సోము వీర్రాజు వరకూ.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా బాబుపై ఏ స్థాయిలో ఫైర్ అయ్యారో.. ఆయనపై ఎంత తీవ్ర వ్యాఖ్యలు చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.

అలాంటి ఫైర్ బ్రాండ్ నేతలున్న బీజేపీ.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు మీద ఎందుకని కస్సుమనరు? మాటలతో మంటలు పుట్టించే సత్తా ఉన్న లక్ష్మణ్ కానీ.. కిషన్ రెడ్డి కానీ.. దత్తాత్రేయ కానీ ఇలా ఏ నేత ఎంతవరకో అంతన్నట్లుగా వ్యవహరించటమే తప్పించి.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం కనిపించదు.

ప్రధాని మోడీని.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి కేసీఆర్ ఘాటు విమర్శలు చేసినా.. తెలంగాణ బీజేపీ నేతల రియాక్షన్ అంతంతమాత్రమేనని చెప్పాలి. కీలకమైన ఎన్నికల వేళలోనూ టీఆర్ఎస్ అధినేత వర్సెస్.. తెలంగాణ బీజేపీ నేతల మాటల్ని చూస్తే.. ఎక్కడా కూడా కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయటం కనిపించదు. విమర్శలు చేసేందుకు అవకాశాలు భారీగానే ఉన్నా.. వేలెత్తి చూపించేందుకు పెద్దగా ఇష్టపడని తత్వం తెలంగాణ కమలనాథుల్లో కనిపిస్తుంది.

ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన వేళలో బీజేపీ నేత లక్ష్మణ్ ఘాటు విమర్శలకు దిగటం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ కీలకభూమిక పోషించాలని కేసీఆర్ అప్పుడే బేరసారాలు మొదలెట్టినట్లుగా ఆరోపణలు చేశారు. కేంద్రంలో హంగ్ వస్తుందన్న భ్రమలో కేసీఆర్ ఉన్నారని.. అయితే.. అలాంటిదేమీ ఉండదని ఆయన చెబుతున్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావటం ఖాయమని.. 300 సీట్లను సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. కేసీఆర్ లాంటి పార్టీల అవసరం ఉందంటున్నారు. ఎన్నికల వేళలో ఘాటు వ్యాఖ్యలు చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. పోలింగ్ ముగిసిన తర్వాత కేసీఆర్ మీద కస్సుమంటూ కాలు దువ్వుతున్న లక్ష్మణ్ మాటల్ని చూస్తుంటే.. ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతాలకు తగ్గట్లే లక్ష్మణ్ గొంతులో మార్పు వచ్చిందంటున్నారు.

ఇటీవల కాలంలో తాము డ్యామేజ్ అయ్యేలా కేసీఆర్ వ్యవహరించారని ఢిల్లీ నేతలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ తీరును ఎండగట్టాల్సిందిగా వచ్చిన సంకేతాలకు అనుగుణంగానే లక్ష్మణ్ మాటలు మారినట్లుగా భావిస్తున్నారు. మొన్నటివరకూ కేసీఆర్ అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించినా.. ఇప్పుడొస్తున్న క్లారిటీ దృష్ట్యా ఆ అవసంర లేదని తేల్చుకోవటంతోనే లక్ష్మణ్ గళం విప్పారంటున్నారు. రానున్న రోజుల్లో గులాబీ బాస్ మీద వదిలే విమర్శనాస్త్రాల్ని చూస్తే.. ఈ విషయంపై మరింత క్లారిటీ రావొచ్చని చెప్పక తప్పదు.
Please Read Disclaimer