టోల్ గేట్లు బంద్…కేటీఆర్ – కవిత – సానియా మీర్జా లైన్లో

0

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జోరుగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేయడానికి ఉత్సాహంగా కదిలి వచ్చారు. ఉద్యోగ – ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన తెలంగాణ వాసులు ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు పరుగులు పెడుతున్నారు. చాలామంది ద్విచక్రవాహనాలు – కార్లలో వెళ్తుండటంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై గల యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం వాహనాల రద్దీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే టోల్ ప్లాజాలు ఎత్తివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటేసే వారు సొంత ఊళ్లకు వెళ్తుండగా ఇబ్బంది పడొద్దని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఉదయం నుంచి వాహనదారులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదిలాఉండగా – టీఆర్ ఎస్ అధినేత – అపద్ధర్మ సీఎం కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చింతమడకలోని పోలింగ్ కేంద్రంలో బూత్ నంబర్ 13లో సీఎం కేసీఆర్ దంపతులు ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. పవనాలు మొదట్నుంచీ అనుకూలంగా ఉన్నాయి. మాకు మంచి ఫలితాలు వస్తాయి. హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు వృద్ధులు భారీగా తరలివస్తున్నారని వివరించారు. కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ తదితరులు ఉన్నారు.

బంజారాహిల్స్ లోని సెయింట్ నిజామిస్ స్కూల్ లో మంత్రి కేటీఆర్ ఓటు హక్కు నియోగించుకున్నారు. ఓటు వేసేందుకు మంత్రి కేటీఆర్ క్యూలో కొద్దిసేపు వేచి ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో ఫొటోలు దిగేందుకు స్థానిక యువతీ యువకులు పోటీపడ్డారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేటీఆర్ పేర్కొన్నారు. హిమాయత్ నగర్లోని సెయింట్ అంథోనిస్ స్కూల్ లో ఉదయం 7.30 గంటలకు మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ ఓటు వేశారు.

టీఆరెస్ ఎంపీ కవిత కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ లోని 177వ పోలింగ్ బూత్ లో కవిత ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఆమె ఓటు వేయడం విశేషం. ఇప్పటికే మంత్రులు హరీష్ రావు – జూపల్లి కృష్ణారావు – జగదీశ్ రెడ్డి ఓట్లు వేశారు. మరోవైపు ఉదయం 9.30 గంటల వరకు 10.15 శాతం పోలింగ్ నమోదైంది.

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇవాళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల పండంటి బాబుకు జన్మనిచ్చిన సానియా.. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఓటేశారు. రాష్ట్రవ్యాప్తంగా టాప్ సెలబ్రిటీలు ఓటేస్తున్నారు. ప్రజలు కూడా భారీ సంఖ్యలో పోలింగ్ బూత్ లకు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 23.4 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
Please Read Disclaimer