వివేకా హత్య.. అతడిపై అనుమానాలు, నేడు అంత్యక్రియలు

0

మాజీ మంత్రి, వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిది సహజ మరణం కాదని, హత్యకు గురయ్యారని పోస్టుమార్టంలో తేలడంతో రాజకీయ రంగును పులుముకుంది. దీనిపై అధికార టీడీపీ, వైసీపీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇందులో టీడీపీ పాత్ర ఉందంటూ వైసీపీ నేతలంటే, జగన్ కుటుంబంలో గొడవల వల్లే వివేకాను హత్య చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల వేళ ఈ హత్యోందంతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తొలుత గుండెపోటుతో వివేకా చనిపోయారని ప్రచారం జరిగినా తర్వాత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన రక్తపుమడుగులో విగతజీవిగా పడిఉండటం, శరీరంపై బలమైన కత్తిపోట్లు కనిపించడంతో ఎవరో హత్య చేశారని పోస్టుమార్టం చేయడానికి ముందే అంచనావేశారు.

పోస్టుమార్టం నివేదికలో అది నిజమేనని తేలింది. దీంతో కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో, వివేకానందరెడ్డిని హత్యచేసిందెవరనే అంశంపై ఆయన కుటుంబ సభ్యులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. పాత నేరస్తుడు సుధాకర్ రెడ్డిపై సందేహం వ్యక్తమవుతోంది. ఇక, సుధాకర్ రెడ్డికి ఘనమైన నేరచరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వైఎస్ తండ్రి రాజారెడ్డి హత్యకేసుతోనూ సుధాకర్ రెడ్డికి సంబంధం ఉన్నట్టు సమాచారం. గతంలో చేసిన నేరాలకు కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించిన సుధాకర్ రెడ్డిని సత్ప్రవర్తన కారణంగా మూడు నెలల కిందట విడుదల చేశారు. అతడే వివేకాను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అంతేకాదు, హత్య జరగడానికి ముందు వివేకా నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్టు భావిస్తున్నారు.

మరోవైపు, వివేకానందరెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం 10.30 గంటలకు జరగునున్నాయి. తండ్రి వైఎస్ రాజారెడ్డి సమాధి వద్దే ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయనను కడసారి చేసేందుకు వైసీపీ అభిమానులు, నేతలు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

కాగా, వివేకానందరెడ్డి హత్య విషయంపై గవర్నర్‌ నరసింహన్‌కు జగన్ ఫిర్యాదు చేయనున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌‌ను జగన్ కలుసుకోనున్నారు. పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకుని వివేకా హత్య విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఏపీలో దిగజారిన శాంతిభద్రతలకు ఈ హత్యలే నిదర్శనమని ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు, వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించాలని కార్యకర్తలకు వైసీపీ పిలుపునిచ్చింది. నల్లచొక్కాలు, నల్ల రిబ్బన్లు ధరించి గాంధీ విగ్రహాలకు వినతిపత్రం సమర్పించి, ప్రదర్శనలు చేపట్టాలని కోరింది.
Please Read Disclaimer