నా కల నెరవేరింది.. ఇకపై జగన్‌కు సపోర్ట్ చేయను: పోసాని

0

వైఎస్ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని తాను దేవుళ్లకు మొక్కుకున్నానని, ఆ మొక్కు ఫలించిందని అన్నారు సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన పోసాని.. జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ను అవినీతిపరుడు, రౌడీ, గూండా, ఫ్యాక్షనిస్ట్ అని విమర్శించిన చంద్రబాబు ఇప్పడెలా స్పందించారని ఆయన నిలదీశారు. కోడికత్తి పార్టీ అని చంద్రబాబు ఎద్దేవా చేసిన వైసీపీని ఏపీ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.

‘ప్రతి రాజకీయ నాయకుడికి సీఎం కావాలన్న కల ఉంటుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన ఎలా సీఎం అయ్యారో ప్రజలందరికీ తెలుసు. కానీ వైఎస్ జగన్ సింహంలా నిజాయతీగా గెలిచాడు. జగన్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పడాన్ని స్వాగతిస్తున్నా. అలాగే జగన్‌పై అక్రమంగా పెట్టించిన కేసులను కూడా వెనక్కి తీసుకుంటే ఆయనకు పాదాభివందనం చేస్తా. జగన్‌పై కక్ష మానుకుని లోకేశ్‌లాగానే తనని కూడా కొడుకులా ఆదరిస్తే చంద్రబాబుపై అందరికీ అభిమానం పెరుగుతుంది. జగన్‌పై నేరాలు మోపినా సరైన ఆధారాలు లేవు కాబట్టే కోర్టులు బెయిల్‌ ఇచ్చాయి. ఆయన నేరం చేయలేదని ప్రజలు నమ్మారు కాబట్టే అధికారం కట్టబెట్టారు.’

‘ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్ చేసి చూపిస్తారు. జగన్ సీఎం కావాలని రాష్ట్రమంతా తిరిగాను. నా కల నెరవేరింది. ఇకపై ఆయనకు సపోర్ట్ చేయను. ప్రజలకు ఏం కావాలో జగన్ చూసుకుంటారు. ఒక్కసారి ఆయన పాలన చూస్తే జీవితాంతం ఆయనకే ఓటేస్తారు. 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చినప్పుడే పవన్ రాజకీయ పతనం మొదలైంది. రాజకీయ అవగాహన ఉన్న పవన్.. అనుభవం పేరుతో చంద్రబాబుకు ఎలా మద్దతిచ్చాడు. రాజకీయాల్లో అనుభవం అవసరం లేదు. నిజాయతీ ఉంటే చాలు. ఎన్టీఆర్‌కు ఏం అనుభవం ఉందని ముఖ్యమంత్రి అయి సుపరిపానల అందించారు. పవన్ 2014లోనే ఎవరితోనూ పొత్తు లేకుండా నేరుగా పోటీచేస్తే ప్రజలు నమ్మేవారు. కానీ ఆయన చంద్రబాబుతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని రాజకీయాలు చేయడం వల్లనే ప్రజలు పవన్‌ను తిరస్కరించారు’ అని పోసాని అన్నారు.
Please Read Disclaimer