షెడ్యూల్‌కు ముందే టీడీపీ జాబితా!

0

ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ స‌భ‌కు మ‌రో రెండు నెలల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు డేరింగ్ నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్నార‌ని చెప్పాలి. గ‌తంలో చంద్రబాబు ఎదుర్కొన్న ఏ ఎన్నిక‌ల్లోనూ పార్టీ అభ్య‌ర్థుల ఖ‌రారు షెడ్యూల్ కంటే ముందుగానే ప్ర‌క‌టించిన దాఖ‌లా లేదు. చివ‌రి నిమిషం దాకా ఆయా నియోజక‌వ‌ర్గాల‌పై స‌మ‌గ్ర విశ్లేష‌ణ‌లు చేస్తూనే కొన‌సాగిన చంద్ర‌బాబు చివ‌రి నిమిషంలోనే పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేవారు.

ఈ క్ర‌మంలో టికెట్లు ఆశించే వారంతా క‌లిసిక‌ట్టుగానే నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకునే వారు. నామినేష‌న్ల‌కు స‌మ‌యం ముగుస్తున్న క్ర‌మంలోనే పార్టీ అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం, ఆ క్ర‌మంలో పెద్ద‌గా అస‌మ్మ‌తి త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం చంద్ర‌బాబు వ్యూహంగా క‌నిపించేది. అక్క‌డ‌క్క‌డా అస‌మ్మ‌తి క‌నిపించినా… వెనువెంట‌నే ట్ర‌బుల్ షూట‌ర్స్‌ను రంగంలోకి దించేసే చంద్ర‌బాబు… త‌న‌దైన శైలి రాయ‌బారాల‌తో అసమ్మ‌తి గ‌ళాల‌ను నిలువ‌రించేవారు.

అయితే ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో మాత్రం చంద్ర‌బాబు కొత్త వ్యూహాన్ని అమ‌లు చేయ‌నున్నారు. ఈ మేర‌కు నేటి ఉద‌యం జ‌రిగిన పార్టీ అత్యున్న‌త నిర్ణాయ‌క విభాగం పొలిట్ బ్యూరోలో చంద్రబాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తానికి భిన్నంగా ఈ ద‌ఫా ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. అది కూడా షెడ్యూల్ విడుద‌ల‌కు కాస్తంత ముందుగానే ఈ జాబితా ప్ర‌క‌టించాల‌ని కూడా ఈ భేటీలో నిర్ణ‌యించారు.

షెడ్యూల్ కంటే ముందుగా విడుద‌ల‌య్యే జాబితాలో మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థులు ఉంటార‌ని… అతి త‌క్కువ స్థానాల‌కు మాత్ర‌మే రెండో జాబితా ప్ర‌క‌టించాల‌ని కూడా బాబు నిర్ణ‌యించారు. ఈ నిర్ణ‌యంతో వైరి వ‌ర్గాల‌కు చంద్ర‌బాబు ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర‌య్యేట్లు చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వాస్తవంగా దాదాపుగా అన్ని పార్టీలు కూడా షెడ్యూల్ విడుద‌ల త‌ర్వాతే అభ్య‌ర్థుల జాబితాల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ఇప్ప‌టిదాకా చంద్ర‌బాబు కూడా ఇదే త‌ర‌హా వైఖ‌రిని అవ‌లంబించినా… ఈ ద‌ఫా వైరి వ‌ర్గాలు త‌న ఓట‌మినే ల‌క్ష్యంగా చేసుకుని పావులు క‌దుపుతున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఈ ద‌ఫా కొత్త వ్యూహాన్ని అమ‌లు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ వ్యూహంలో భాగంగా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు ముందే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డం ద్వారా… అభ్యర్థులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల‌కు ముందుగానే ప్ర‌చారం చేసుకునే వెసులుబాటు ఉంద‌ని చెప్పాలి. అంతేకాకుండా ఎక్క‌డైనా అసంతృప్తి త‌లెత్తితే… అప్ప‌టిక‌ప్పుడు ట్ర‌బుల్ షూట‌ర్స్‌ను రంగంలోకి దింపాల్సిన ప‌ని లేకుండానే తాపీగానే వాటిని చ‌ల్లార్చేయొచ్చ‌న్న‌ది చంద్ర‌బాబు భావ‌న‌గా తెలుస్తోంది. మొత్తంగా విప‌క్షాల కంటే ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌న్న వ్యూహం చంద్ర‌బాబుకు బాగానే వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలే అధిక‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.
Please Read Disclaimer