వచ్చే ఐదు రోజులూ మరింత ఎండలు.. అప్రమత్తంగా ఉండాలని సూచన!

0

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని ఆలస్యంగా తాకడమే కాదు, వాయు తుఫాను కారణంగా అవి ముందుకు కదలడం లేదు. రుతుపవనాల కదలికలో మంగళవారం కూడా ఎలాంటి మార్పులేదు. వాయు తుఫాను తీవ్ర గాలులు రుతుపవనాల్లో తేమను లాగేసుకోవడంతో అవి విస్తరించే అవకాశానికి గండిపడింది. దీంతో రుతపవనాల వల్ల వర్షాలు కురవడం తాత్కాలికంగా ఆగిందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల వరకూ ఎండలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

ఏపీలోని ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకన్నా ఎక్కువగానే ఉంటాయని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏపీలో మంగళవారం అనేక చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాబోయే 24 గంటల పాటు తీర ప్రాంతంలో నైరుతి వైపు నుంచి గంటలకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయని విపత్తు నిర్వహణశాఖ పేర్కొంది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.

జూన్ 12న ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీలు, విశాఖ, విజయనగరం, కడప జిల్లాల్లో 39 నుంచి 40 డిగ్రీలు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. జూన్‌ 13న విశాఖ ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీలు, శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో 39 నుంచి 40 డిగ్రీలు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 37నుంచి 38 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుందని వెల్లడించింది. జూన్‌ 14న విశాఖపట్టణం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీలు, శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో 38 నుంచి 39 డిగ్రీలు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 36 నుంచి 37 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.

జూన్‌ 15న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీలు, పశ్చిమగోదావరి, గుంటూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదువుతుంది. జూన్‌ 16న విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 39 నుంచి 40 డిగ్రీలు, ప్రకాశం, గుంటూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 37 నుంచి 38 డిగ్రీలు, ఉత్తారంధ్ర జిల్లాల్లో 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో రెండు రోజులు భానుడు భగభగలు తప్పవని, ఉత్తర తెలంగాణలో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రామగుండంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Please Read Disclaimer