టీడీపీలో చేరిన వంగవీటి రాధా.. జగన్‌పై వెన్నుపోటు కామెంట్లు

0

వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణ తెలుగు దేశం పార్టీలో చేరారు. బుధవారం రాత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకొని రాధా, ఆయన అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ వైఎస్ జగన్‌పై ఘాటైన విమర్శలు చేశారు. ఆయనకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. జగన్‌లో ఎప్పుడూ సీఎం కావాలనే ఆరాటం చూశానని ఆయన ఎద్దేవా చేశారు. తనను తమ్ముడు అని చెప్పిన జగన్ వెన్నుపోటు పొడిచారన్నారు. అందరితో చేతులు కలిపి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారన్నారు. ఇకనైనా మారు జగన్ రెడ్డి అంటూ వైఎస్ఆర్సీపీ అధినేతకు సూచించారు. జగన్‌కు మరోసారి ప్రతిపక్ష స్థానమేనని జోస్యం చెప్పారు.

గత జనవరిలోనే రాధా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. వెంటనే ఆయన టీడీపీలో చేరతానే వార్తలొచ్చాయి. కానీ విజయవాడలో పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని ఆయన సీఎంను కోరారు. రాధా అభ్యర్థన పట్ల సీఎం సానుకూలంగా స్పందించారు. దీంతో ఎన్నికల ముందు ఆయన తెలుగు దేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో టీడీపీ చిత్తశుద్ధితో వ్యవహరించిందన్నారు. కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేస్తే జగన్‌ అసెంబ్లీకి కూడా రాలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ కనుసన్నల్లో జగన్ పని చేస్తున్నారని విమర్శించారు.
Please Read Disclaimer