వొడాఫోన్ ఐడియా 62 శాతం డిస్కౌంట్!

0

దిగ్గజ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా రైట్స్ ఇష్యూ ద్వారా దాదాపు రూ.25,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కొత్త ఈక్విటీ జారీ ద్వారా ఈ మేర నిధులను పొందాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇదే జరిగితే ఇన్వెస్టర్లకు 62 శాతం డిస్కౌంట్‌ లభించినట్లే. అదేలా అంటారా? చూడండి..

దేశీ అతిపెద్ద టెలికం ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఐడియా 2,000 కోట్ల కొత్త ఈక్వీటీ షేర్లను జారీ చేయనుంది. ఈ రైట్స్‌ ఇష్యూలో ఒక్కో ఈక్విటీ షేరును (రూ.10 ముఖ విలువ) రూ.12.50 ధరకు జారీ చేయడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. బుధవారం వొడాఫోన్‌ ఐడియా ముగింపు ధర (రూ.33)కు ఇది దాదాపు 62 శాతం తక్కువ. అంటే ఇన్వెస్టర్లకు వొడాఫోన్ ఐడియా షేరు 62 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది.

రైట్స్‌ ఇష్యూకు రికార్డ్‌ తేదీ వచ్చే నెల 2. అంటే ఏప్రిల్‌ 2వ తేదీలోపు ఎవరి దగ్గరైతే వొడాఫోన్‌ ఐడియా షేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ రైట్స్‌ ఇష్యూలో షేర్లు పొందడానికి అర్హత ఉంటుంది. ప్రతి 38 ఈక్విటీ షేర్లకు కొత్తగా 87 రైట్స్‌ షేర్లను జారీ చేస్తారు. రైట్స్‌ ఇష్యూ ఏప్రిల్‌ 10న మొదలై 24న ముగుస్తుంది. ఈ రైట్స్‌ ఇష్యూలో ప్రమోటర్‌ సంస్థలు–వొడాఫోన్‌ గ్రూప్‌ రూ.11,000 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.7,250 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేయనున్నాయి.

రైట్స్‌ ఇష్యూ వల్ల సమకూరే నిధులతో ఆర్థికంగా మరింతగా పుంజుకొని రిలయన్స్‌ జియోకు వొడాఫోన్‌ ఐడియా గట్టిపోటీనివ్వగలదని నిపుణుల అంచనా. ఐడియా రుణ భారం రూ.1,23,660 కోట్లుగా ఉంది. ఈ రుణ భారం తగ్గించుకోవడానికి రైట్స్‌ ఇష్యూ నిధులను వినియోగించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది.
Please Read Disclaimer