ట్రైలర్ టాక్: ముద్దులే కాదు.. అంతకుమించి

0‘మిణుగురులు’ అనే మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి. ఐతే ఈ చిత్రానికి అవార్డులైతే వచ్చాయి కానీ.. కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అలాంటి సినిమాను రూపొందించిన దర్శకుడు తన రెండో సినిమాకు ‘24 కిసెస్’ అని టైటిల్ పెట్టడం.. టీజర్లో ముద్దుల మోత మోగించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. టీజర్ తర్వాత రిలీజ్ చేసిన పాట కూడా ముద్దుల చుట్టూనే తిరిగింది. తొలి సినిమాకు కమర్షియల్ సక్సెస్ దక్కని నేపథ్యంలో అతను ఒక ఫ్రస్టేషన్లో ఈ సినిమా తీశాడేమో అన్న కామెంట్లు కూడా పడ్డాయి. ఐతే తాజాగా ఈ చిత్ర ట్రైలర్ వదిలారు. అది చూస్తే.. ఇందులో ముద్దులతో పాటు అంతకుమించిన విషయం కూడా ఉందని అర్థమవుతోంది. ఇంతకీ ఈ ట్రైలర్ విశేషాలేంటో చూద్దాం పదండి.

ప్లేబాయ్ లాగా జీవితాన్ని గడిపేసే ఓ అబ్బాయి జీవితంలోకి అమాయకురాలైన అమ్మాయి వస్తుంది. అతడితో ప్రేమలో పడుతుంది. ఆ అమ్మాయి సిన్సియర్ గా అతడిని ప్రేమిస్తుంది. అతడితో హద్దులు దాటుతుంది. కానీ అతను మాత్రం అప్పటిదాకా అందరమ్మాయిలతో ఎలా వ్యవహారం నడిపాడో ఈమెతోనూ అలాగే నడుపుతాడు. అక్కడే కథ అడ్డం తిరుగుతుంది. ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చిందన్నదే ఈ కథ. ట్రైలర్లోనూ ముద్దుల మోత కనిపించింది. అదే సమయంలో ఇందులో ఆసక్తికరమైన కథ ఉందనిపిస్తోంది. రావు రమేష్ డిఫరెంటె్ గెటప్ లో కీలక పాత్ర చేసినట్లున్నాడు. ఆయన పాత్ర ట్రైలర్లో బాగా హైలైట్ అయింది. ముఖ్యంగా చివర్లో ‘‘అద్వైతాన్నైనా అర్థం చేసుకోవచ్చు కానీ ఆడదాన్ని అర్థం చేసుకోలేం.. అని ఎస్వీఆర్ అన్నారు’’ అంటూ తనదైన శైలిలో ఆయన పేల్చిన పంచ్ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 13న వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయబోతున్నారట.