దేశంలో రైల్వేస్టేషన్లలో వైఫై సేవలు

0wifi-in-railway-stationsభారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. దేశంలోని దాదాపు 8,500 రైల్వేస్టేషన్లలో వైఫై సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీటిల్లో మారుమూల ప్రాంతాల్లోని స్టేషన్లు కూడా ఉన్నాయి.ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం దాదాపు రూ.700 కోట్లు వెచ్చించనుంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగానే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దేశంలోని 216 ప్రధాన రైల్వేస్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 70 లక్షల మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకున్నారు.

గ్రామీణులకు కూడా వైఫై..!

ఇటీవల జరిగిన రైల్వేశాఖ కీలక సమావేశంలో ఈ ప్రాజెక్టుకు తుది రూపునిచ్చారు. 1,200 స్టేషన్లలో ఏర్పాటు చేసే వైఫైలు రైల్వే ప్రయాణికులకు మాత్రమే సేవలను అందించనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని 7,300 స్టేషన్లలో ఏర్పాటు చేసే వైఫైలు ప్రయాణికులతో పాటు స్థానికులకు కూడా ఇంటర్నెట్‌ను అందించేలా ప్రణాళిక సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇ-గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ స్టేషన్లలో ప్రత్యేక కియోస్క్‌లను ఏర్పటు చేయనున్నారు. దీంతో డిజిటల్‌ బ్యాంకింగ్‌, ఆధార్‌ అనుసంధానం, ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు, పన్నులు, బిల్లుల చెల్లింపు సేవలు వంటివి అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లలో వస్తు కొనుగోళ్లు కూడా చేసుకోవచ్చు.

తొలిదశలో..

ఈ ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో 600 స్టేషన్లలో వైఫైను అందుబాటులోకి తీసుకురానున్నారు. మార్చి 2018 నాటికి ఇది పూర్తికానుంది. మిగిలిన స్టేషన్లలో మార్చి 2019 నాటికి వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.