14 ఏళ్లుగా స్కూలుకు సెలవే పెట్టని విద్యార్థిని మీరు చూశారా..?

0School-Attendance-for-14-Yearsజలుబు, దగ్గు, కడుపునొప్పి…ఇలా కుంటిసాకులతో స్కూలు ఎగ్గొట్టని విద్యార్థులు బహుశా ఉండకపోవచ్చు. గట్టిగా ఎండొచ్చినా, నాలుగు చినుకులు పడినా బంద్‌లు మామూలే. కాలేజీ వయసు వస్తే ‘డుమ్మా’ కొట్టడం ఫ్యాషన్. అయితే గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ విద్యార్థి అప్పర్ కేజీ నుంచి 12వ తరగతి వరకూ 14 ఏళ్లుగా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా అన్ని వర్కింగ్‌ డేస్‌లోనూ హాజరై రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టేశాడు. ఈ చిచ్చర పిడుగు పేరు భార్గవ్. పీఆర్ ఖటివాలా విద్యాసాంకుల్ విద్యార్థి. ఇతను సాధించిన ఫీట్ మామూలుదేం కాదు. 2906 రోజులు (గత పధ్నాలుగేళ్లలో) హాజరుపట్టీలో గైర్హాజరనేదే లేకపోవడంతో అతను చేసిన అరుదైన ఫీట్‌ను ఇండియా వరల్డ్ రికార్డ్, యునీక్ వరల్డ్ రికార్డ్, ఇండియా స్టార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ గుర్తించాయి. ఆసక్తికరంగా ఇంతకుముందు స్కూలుకు డుమ్మా కొట్టకుండా 2,537 రోజుల రికార్డు అతని పెద్ద సోదరుడు వాత్సల్ పేరుతో ఉంది. ఆ రికార్డునే ఇప్పుడు భార్గవ్ బద్దలుకొట్టాడు.

‘స్కూలుకు వెళ్లడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆదివారం ఒక్కరోజు సెలవు చాలు. మరిన్ని సెలవులు కావాలని ఏరోజూ అనుకోలేదు. నన్ను చూసి విద్యార్థులు కూడా స్కూలుకు డుమ్మాలు కొట్టకుండా వస్తుండటం చూస్తే వారికి స్ఫూర్తిగా నిలిచాననే తృప్తి నాకు దక్కింది’ అని భార్గవ్ తెలిపాడు. ఒకసారి తన స్కూలు బస్సు బోల్తా పడి తన ముఖానికి గాయాలయ్యాయని, డాక్టర్ దగ్గరకు వెళ్లే బదులు తాను, తన సోదరుడు నేరుగా స్కూలుకే వెళ్లిపోయామని భార్గవ్ గుర్తు చేసుకున్నాడు. జ్వరం వచ్చినా సరే ఏరోజూ తాను స్కూలు మానిందే లేదని చెప్పాడు.

కామర్స్‌లో డిప్లమో పాసైన భార్గవ్‌ తమకు గర్వకారణమని అతని తల్లిదండ్రులతో పాటు స్కూలు అధికారులు అభినందనలు కురిపిస్తున్నారు. ‘మా స్కూలు గర్వించే విద్యార్థులు భార్గవ్, వాత్సల్. ఆ ఇద్దర్నీ చూసి తోటి విద్యార్థులు కూడా స్కూలుకు ఎగ్గొట్టకుండా వస్తున్నారు’ అని స్కూలు అధికారులు సగర్వంగా చాటుకున్నారు.