2.0: టీజర్లో కాన్సెప్ట్ చెప్పేసిన శంకర్!

0అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘2. 0’ టీజర్ నిన్నే రిలీజ్ అయింది. మేకర్స్ మాత్రం సినిమా బడ్జెట్ రూ. 543 కోట్లు అని ప్రచారం చేస్తుంటే తెలుగులో ఉన్న ఒక ప్రముఖ న్యూస్ డైలీ ఆ బడ్జెట్ ని జస్ట్ రెండు తో మల్టిప్లై చేసి పుసుక్కున వెయ్యి కోట్లు అనేసింది.. హతవిధీ! సోషల్ మీడియా జమానాలో కూడా జనాలు వెర్రి వెంగళప్పలు అని వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. 500 కోట్లు(ఒకవేళ నిజమే అయితే) వెనక్కి తీసుకురావడం ఎలాగా అని లైకా వాళ్ళు తల పట్టుకు కూర్చున్నారు. ఇక వీళ్ళు మాత్రం వాళ్ళకే టెన్షన్ పెరిగేలా బడ్జెట్ ను పెంచుతున్నారు.

సరే మనలని మనోళ్ళే వెర్రిపప్పలను చేసుకోవడం తెలుగువాళ్ళకు కామన్ అయిపోయింది. కబాలి కే 500 కోట్ల కలెక్షన్ వచ్చిందని రిపోర్ట్ చేసిన సదరు పత్రికకు 2.0 బడ్జెట్ 1000 కోట్ల ఫిగర్ అయినా లేకపోతే రజినీ స్టార్ డమ్ తగ్గిపోతుందని అనుకున్నారేమో. ఇలాంటి హాటు టాపిక్కు మనకొద్దు. అసలు టీజర్ సంగతే మాట్లాడుకుందాం. టీజర్ లో శంకర్ కాన్సెప్ట్ చెప్పాడా.. గ్రాఫిక్స్ మాత్రమే చూపించాడా?

ఇప్పటికే అభిమానులు కొందరో టీజర్లో చూపించిన సినిమా కాన్సెప్ట్ ను డీకోడ్ చేసిపెట్టారు. అదెంటో చూద్దాం. టీజర్ స్టార్టింగ్ లోనే ఒక సెల్ ఫోన్ టవర్ చూపిస్తారు. ఒక మనిషి అందులో ఒక మనిషిని ఉరి వేసుకున్నాడు అన్నట్టుగా కిందనుంచి చూపిస్తారు. టవర్ చుట్టూ పక్షులు తిరుగుతూ బాధగా అరుస్తుంటాయి. ఇక కట్ చేస్తే అక్షయ్ రివెంజ్ అవతారంలో సెల్ ఫోన్స్ ను అయస్కాంతంలాగా లాగేసుకుంటూ రచ్చ చేస్తాడు. దీంతో సైంటిస్ట్ వసీకర్(రజనీకాంత్) దానికి విరుగుడుగా చిట్టి రోబోను తీసుకురావాల్సిందే అంటాడు. ఇక క్రోమాన్ కు చిట్టి రోబోకు ఫైట్ షురూ.

ఇందులో అంతర్లీనంగా ఉన్న విషయం ఏంటంటే టెక్నాలజీ వల్ల పశుపక్ష్యాదుల ఉనికికే ప్రమాదం ఏర్పడింది(మొబైల్ ఫోన్స్ వాడకం వల్ల.. ఆ రేడియేషన్ వల్ల పక్షులు అంతరించి పోయే ప్రమాదం ఉందని రీసెర్చ్ లు చెబుతున్నాయి). ప్రకృతి ని కాపాడేందుకు పోరాడుతున్న కొంతమంది ని కార్పోరేట్లు అడ్డుకుంటున్నాయి. చంపేస్తున్నాయి. ఈ దారిలోనే నిజాయితీపరుడైన అక్షయ్ కూడా చనిపోతాడు.. కానీ క్రోమాన్ గా మారి రివెంజ్ తీర్చుకుంటాడు. కానీ దానివల్ల అందరికీ ఇబ్బంది వస్తుంది కాబట్టి వసీకర్.. చిట్టి రోబోలు సీన్ లో కి వస్తారు. ఇదండీ అభిమానులు డీకోడ్ చేసిన స్టొరీ. ఒకవేళ ఇదే నిజమైతే అక్షయ్ కుమార్ రోల్ రజనీని డామినేట్ చేయడం ఖాయం. అదే కరెక్ట్ అయితే సౌత్ కంటే నార్త్ ఆడియన్స్ కు ఎక్కువగా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇక అక్షయ్ విలన్ కాదు.. యాంటి హీరో అన్నమాట!