త్వరలో ఎటిఎం లో 200 రూపాయల నోట్లు

0200-rupees-notesపెద్దనోట్లను రద్దు చేసి రూ.2000 నోటును తీసుకొచ్చిన తర్వాత ప్రజలకు ఎదురైన చిల్లర కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం రూ.200 నోటును విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబరు నుంచి ఈ నోటు చలామణీలోకి వచ్చినా కేవలం బ్యాంకుల ద్వారానే ఇవ్వడంతో విరివిగా వినియోగంలోకి రాలేదు. దీంతో ప్రజలకు చిల్లర సమస్య తీర్చేందుకు ఈ నోట్లను వీలైనంత త్వరగా ఏటీఎంల ద్వారా అందజేయాలని బ్యాంకులను భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) ఆదేశించింది.

‘రూ. 200 నోట్లను వీలైనంత త్వరగా ఏటీఎం ద్వారా అందించాలని బ్యాంకులను, ఏటీఎం తయారీదారులను ఆర్‌బీఐ ఆదేశించింది’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న, పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఆర్‌బీఐ ఆదేశాల నేపథ్యంలో బ్యాంకులు కూడా అందుకు ఏర్పాట్లను ప్రారంభించాయట. రూ.200నోట్లను జారీ చేసేందుకు వీలుగా ఏటీఎంలలో మార్పుల ప్రక్రియను చేపట్టాయని సదరు అధికారులు పేర్కొన్నారు. మరో 5 నుంచి ఆరు నెలల్లో ఏటీఎంలలో రూ.200 నోట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అయితే దీనిపై ఆర్‌బీఐ నుంచి ఎలాంటి స్పష్టత లేదు.

అయితే రూ.200నోట్లను ఏటీఎంల ద్వారా ఇవ్వాలంటే అందుకోసం వాటిలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ కరెన్సీ సైజుకు తగ్గ వాల్టులను ఇన్‌స్టాల్‌ చేయాల్సి ఉంటుందని ఏటీఎం తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఈ మార్పుల కోసం ఒక్కో ఏటీఎంపై సగటున రూ.5000 ఖర్చు చేయాల్సి ఉంటుందట. దేశవ్యాప్తంగా మొత్తం 2.2 లక్షల ఏటీఎంలు ఉండగా.. వీటన్నింటిని మార్చాలంటే రూ.110కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నాయి. ఇప్పటికే మార్పుల ప్రక్రియ ప్రారంభించగా.. జులై నాటికి ఏటీఎంలలో రూ. 200నోట్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నాయి.