ఖైదీ నంబర్ 150 టికెట్‌పై 92% డిస్కౌంట్!

0khaidi-no-150-audiance-reviewకలెక్షన్లలో ఖైదీ నంబర్ 150 గత రికార్డులన్నింటినీ నిజంగానే బద్దలు కొట్టిందా? తొలిరోజు కలెక్షన్స్‌లో బాహుబలి వసూళ్లను అధిగమించిందా? తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లను సాధించిందని, ఈ సినిమా ఒక్క రోజులో 47 కోట్లకు పైగా వసూళ్లు సాధించిపెట్టినట్టు తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బాహుబలి తొలి రోజు 35 కోట్లతో సరిపెట్టుకోగా ఖైదీ నంబర్ 150, ఆ రికార్డ్ ను దాటి కొత్త చరిత్ర సృష్టించినట్టు కూడా బహిరంగంగా ప్రకటించారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నట్టు అంతటా వార్తలొచ్చాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్రల్లోనే కాకుండా అమెరికాలో కలెక్షన్లు రికార్డులు సృష్టిస్తోందని ఆ సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు. భోగి ముందు రోజు, భోగి రోజు సినిమా థియేటర్లలో కలెక‌్షన్లు తగ్గుతాయని, అయితే అందుకు భిన్నంగా తమ సినిమా భోగి ముందు రోజు తెలంగాణలో 2.50 కోట్ల షేర్‌ వసూలు చేసిందన్నారు. అలాగే రూ.4.50 కోట్ల గ్రాస్‌ కలెక‌్షన్‌ సాధించి రికార్డు సృష్టించిందన్నారు.

ఈ సినిమా కలెక్షన్ల విషయంలో గీతా ఆర్ట్స్ అధినేత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఒక అడుగు ముందుకేసి ఖైదీ నెంబర్ 150 తొలిరోజు కలెక్షన్లు చూసిన తర్వాత చిరంజీవితో 151వ సినిమా తీయాలంటే భయమేస్తోందని కూడా చెప్పారు. తొలిరోజు ఖైదీ నెం. 150 సినిమాకు 47 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని ఆయన తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 30 కోట్లు వచ్చిందని, ఓవర్సీస్ కలెక్షన్లు కూడా బాగున్నాయని అన్నారు. (చదవండి- చిరంజీవితో సినిమా అంటే భయమేస్తోంది)

ఈ డిస్కౌంట్ల మాటేంటి సారూ..

ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్స్ సాధించినట్టు సినిమావర్గాలు చెబుతుంటే మరోవైపు అమెరికాలో డిస్కౌంట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను అమెరికాలోనూ విడుదల చేయగా, దాదాపు అన్ని థియేటర్లలోనూ డిస్కౌంట్ ఆఫర్‌తో టికెట్లను విక్రయించారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లోని తెలుగువారు ఫండాంగో వెబ్ సైట్ ద్వారా సినిమా టికెట్లను కొనుగోలు చేస్తుంటారు.