టాలీవుడ్ నిర్మాత మీద కేసు బుక్

0మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణపై టాలీవుడ్ నిర్మాత ఒకరిపై తాజాగా కేసు నమోదైంది. రాజా మీరు కేక మూవీ నిర్మాత రమేష్ రెడ్డిపై ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

ఎస్ ఆర్ నగర్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం రాజా మీరు కేక మూవీకి క్రిష్ణ కిశోర్ దర్శకత్వం వహించగా.. రమేశ్ రెడ్డి.. రాజ్ కుమార్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీకి కెమెరామెన్ గా పి. రవిరెడ్డి వ్యవహరించారు. ఆయనకు నిర్మాత రమేశ్ రెడ్డి రూ.2లక్షలు పారితోషికం ఇచ్చారు.

అయితే.. ఈ మూవీ నిర్మాతలు ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తటంతో తాను ఇచ్చిన రూ.2లక్షల్ని తనకు తిరిగి ఇచ్చేయాలంటూ కెమేరామెన్ కు కోరారు. ఈ సందర్భంగా నిర్మాత రమేశ్ రెడ్డి.. కెమేరామెన్ సతీమణిని తిడుతూ.. అసభ్యంగా వ్యవహరించినట్లుగా ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. నిర్మాత రమేశ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.