రోడ్డుపై రక్తపుమడుగులో యువతి, వీడియోలు తీసిన ప్రజలు

0మనిషిలో మానవత్వపు విలువలు మంటగలుస్తున్నాయి. టెక్నాలజీని మనుషుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించాల్సింది పోయి, ప్రాణాలను పోతున్నా కనీసం పట్టించుకోని దురదృష్టకర ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. ఈ తరహ ఘటన ఒకటి నిర్మల్ జిల్లాలో చోటుచేసుకొంది. గొంతులో కత్తితో రక్తమోడుతూ ప్రాణాలను కాపాడాలని ఓ యువతి రెండు గంటలపాటు ప్రాధేయపడినా పట్టించుకోలేదు, కానీ, ఈ వీడియోలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించేందుకు పోటీపడ్డారు.

స్వంత తమ్ముడే కిరాతకంగా హత్య చేశాడు. అయితే ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితురాలు రక్షించాలని కోరింది. అయితే ఈ ఘటనను తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేస్తూ నిలబడిన జనం కనీసం వారికి సహయం చేసేంందుకు ప్రయత్నించలేదు.

పదిరోజుల క్రితం నిర్మల్ జిల్లా సరిహద్దులోని మహరాష్ట్ర కుబీర్ మండలం నిగ్వా గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. మహరాష్ట్ర బోకర్ తాలుకా కేర్బాన్ గ్రామంలో పక్క పక్క ఇళ్ళలోనే పూజ, గోవింద్‌లు నివాసం ఉంటారు.

పూజది వడ్డెర కులం, గోవింద్ దళితుడు. ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకొన్నారు. పెళ్ళి చేసుకోవాలనుకొన్నారు.ఆమె ప్రేమని పెద్దలు ఒప్పుకోలేదు. పూజకు వేరే వ్యక్తితో వివాహం చేశారు. కానీ, వారి ప్రేమ మాత్రం చావలేదు.

పెళ్ళైన నెలరోజుల తర్వాత వారిద్దరూ కలిసి బతకాలనుకొన్నారు. వారిద్దరూ ఇంటి నుండి పారిపోయారు. పూజ కోసం కుటుంబసభ్యులు గాలించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పూజ సెల్‌కు ఆమె తమ్ముడు దిగంబర్ ఫోన్ చేశాడు.

ఇద్దరూ తిరిగి వస్తే మళ్ళీ పెళ్ళి చేస్తామని నమ్మించాడు. దీంతో పూజ తాము నిగ్వా వైపు వెళ్తున్నామని చెప్పింది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొన్న దిగంబర్ తన విశ్వరూపాన్ని చూపాడు.

పూజ, గోవింద్‌లపై కత్తితో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో గోవింద్ అక్కడికక్కడే ప్రాణాలను వదిలాడు. పూజను ఏకంగా గొంతు కోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ పూజ రోడ్డుపై పడిపోయింది. ఆమె చనిపోయిందని భావించిన దిగంబర్ అక్కడి నుండి పారిపోయాడు.

అలా రోడ్డుపై పడి ఉన్న పూజ రెండు గంటలపాటు ప్రాణాలతో కొట్టుమిట్లాడింది. కనీసం ఒక్కరూ కూడ ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. ఆమెకు చిన్న సహయం కూడ అందించలేదు. పైగా ఆమె సహయం కోసం ప్రాధేయపడుతోంటే ఒక్కరూ కూడ ముందుకు రాలేదు. పైగా ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లో రికార్డు చేసేందుకు ఆసక్తిచూపారు చాలా మంది. ఈ వీడియోలను తీసి మరీ ఆనందించారు.

అయితే ఆమె చివరి క్షణంలో కూడ అతి కష్టమ్మీద లేచి కూచొంది. ఆమె ప్రతి క్షణాన్ని తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ దృశ్యాలు పదిరోజుల తర్వాత వెలుగుచూశాయి.