ప్రయోగాల హీరో ఛాలెంజింగ్ రోల్

0

మెగా డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి వారసుడిగా ఆది పినిశెట్టి సినీరంగంలో అడుగుపెట్టినా అతడు తనదైన మార్క్ తో కెరీర్ ని సాగిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రిలా డైరెక్టర్ కాకుండా తాను హీరో అయ్యాడు. అంతేకాదు తొలి నుంచి ప్రయోగాత్మక పాత్రల్ని ఎంచుకుంటూ కొత్తదనం అనే ఒరవడితో ముందుకు సాగుతున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆదికి ఫాలోయింగ్ పెరగడం వెనక కారణమిదే. ఇటు తెలుగు.. అటు తమిళం రెండు చోట్లా ఆదికి ప్రత్యేకించి అభిమానులున్నారు. అన్ని పరిశ్రమల్లో ఇంత ఠఫ్ కాంపిటీషన్ ఉన్నా తనకంటూ యూనిక్ నెస్ కోసం ప్రయత్నించే హీరోగా గుర్తింపు ఉంది.

గుండెల్లో గోదారి .. మలుపు..యూటర్న్.. నీవెవరో ఇవన్నీ ప్రయోగాలే. వీటిలో ఆది పినిశెట్టి నటనకు చక్కని ఐడెంటిటీ దక్కింది. ఇక బన్ని సరైనోడు.. చరణ్ రంగస్థలం చిత్రాల్లోనూ ఆది ప్రత్యేకత ఉన్న పాత్రలతో మెప్పించాడు. చిట్టిబాబు అన్నగా ఆది నటనకు ప్రేక్షకులు గొప్ప మార్కులు వేశారు. ఇకపోతే ఆది మునుముందు ప్రయోగాల బాటలోనే వెళుతుండడం ఆసక్తికరం. ఆది ఈసారి ఓ స్పోర్ట్స్ డ్రామాతో ప్రయోగం చేస్తున్నాడు. దీనికి `క్లాప్` అనే టైటిల్ ని నిర్ణయించారు. నేటి ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మ్యాస్ట్రో ఇళయరాజా క్లాప్ నివ్వగా అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బోయపాటి శ్రీను- బొమ్మరిల్లు భాస్కర్ స్క్రిప్టు ప్రతుల్ని దర్శకుడికి అందించారు.

ఈ స్పోర్ట్స్ డ్రామాలో.. ఆది ఓ అథ్లెట్ పాత్రలో నటిస్తున్నాడు. తక్కువ దూరాల్ని వేగంగా చేధించే ఫాస్ట్ రన్నర్ (స్ప్రింటర్) గా ఆది మెరిపించబోతున్నాడట. ఇందులో 400 మీటర్లు రన్నింగ్ రేసు ఉంటుంది. రేస్ లో ఛాలెంజర్ గా ఆది కనిపిస్తారు. ఇక ఈ పాత్ర కోసం ఇప్పటికే కసరత్తులు చేసి 10 కేజీల బరువు తగ్గాడట. నేటి ఓపెనింగ్ వేడుకలో లుక్ చాలా వరకూ కొత్త గా కనిపించింది. పృథ్వీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో దేవదాస్ ఫేం ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఆకాంక్ష కూడా ఇందులో ఒక క్రీడాకారిణిగా కనిపించనున్నారు. అథ్లెట్ గా కెరీర్ సాగించే హీరో లైఫ్ జర్నీలో కీలక పాత్ర ఇది. ఇక ఈ చిత్రం కోసం వేరొక కథానాయికగా క్రిష కరూప్ నటిస్తున్నారు. హైదరాబాద్- చెన్నయ్- బెంగళూరు- మధురై తదితర నగరాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వరుసగా ప్రయోగాలు చేస్తున్న ఆది.. తాజా ప్రయోగంతో ఏమేరక ఆకట్టుకోనున్నారో చూడాలి.
Please Read Disclaimer