ఫ్లాప్ హీరో అవతారం మార్చాడు

0

సాయికుమార్ నట వారసత్వాన్ని అందుకుని తెరంగేట్రం చేసిన యువ నటుడు ఆది సాయికుమార్. ఐతే ఇండస్ట్రీలోకి వచ్చి ఏడెనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ అతను నిలదొక్కుకోలేదు. ఇప్పటికీ అతడిని ఆది సాయికుమార్ అంటున్నారు తప్ప.. అతడికంటూ సొంత గుర్తింపు రాలేదు. కెరీర్ ఆరంభంలో ఆది చేసిన ‘ప్రేమ కావాలి’.. ‘లవ్లీ’ లాంటి యావరేజ్ సినిమాల గురించే ఇప్పటికే చెప్పుకోవాల్సి వస్తోంది తప్ప అతడి నుంచి ఓ మోస్తరు సినిమాలు వచ్చి కూడా చాలా కాలం అయిపోతోంది. చివరగా ఆది నుంచి వచ్చిన ‘నెక్స్ట్ నువ్వే’ కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థలో చేసిన ఈ చిత్రం కూడా అతడి రాత మార్చలేదు. ఇప్పుడు ఆది ఆశలన్నీ ‘వినాయకుడు’ ఫేమ్ సాయికిరణ్ అడివి తీసిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ మీదే ఉన్నాయి.

ఈ థ్రిల్లర్ మూవీలో ఆది లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఆది సైనికుడి పాత్ర పోషిస్తుండటం విశేషం. అతను ఎన్ఎస్జీ కమాండో అర్జున్ పండిట్ గా కనిపించనున్నాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఆది లుక్ చాలా బాగుంది. అతడి కెరీర్లో ఇదే బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. కెరీర్ కు చాలా ముఖ్యమైన సినిమా కావడం.. పైగా సాయికిరణ్ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడితో చేస్తున్న సినిమా కావడంతో ఆది ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లే కనిపిస్తోంది. ఆదితో పాటు ఎయిర్ టెల్ 4జీ ప్రకటనలతో పాపులారిటీ సంపాదించిన షాషా చెత్రితో పాటు ‘కేరింత’ నూకరాజు.. కృష్ణుడు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రచయిత అబ్బూరి రవి ఇందులో విలన్ గా కనిపించనుండటం విశేషం. డిసెంబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నారు.
Please Read Disclaimer