ఔను ఎక్కువ పారితోషకమే తీసుకుంటా-ఆమిర్

0



ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుడు ఆమిర్ ఖాన్. ‘దంగల్’ సినిమాకు రికార్డు స్థాయిలో అతను రూ.75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఐతే అతను సినిమా విడుదలకు ముందు పారితోషకం తీసుకోడు. లాభాల్లోంచి వాటా తీసుకుంటాడు. ఆ రకంగా వచ్చిన దక్కిన మొత్తమే అది. నిజానికి ఆమిర్ పారితోషకం అక్కడికే పరిమితమా అన్నది కూడా డౌటే. ఎందుకంటే ఇండియాలో వచ్చిన వసూళ్లలో వాటా ప్రకారం అతడికి ఆ మొత్తం దక్కింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేస్తే అక్కడ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందులోంచి ఆమిర్ కు ఎంత వాటా దక్కిందో తెలియదు మరి. తాజాగా ఆమిర్ ఒక కార్యక్రమంలో భాగంగా తన పారితోషకం లెక్కల గురించి మాట్లాడాడు.

తాను లాభాల్లో అత్యధిక వాటా తీసుకునే విషయం నిజమే అని ఆమిర్ చెప్పాడు. ఐతే ఒక సినిమాకు సంబంధించి అత్యధిక రిస్క్ తీసుకునేది తానేనని.. అందుకే లాభాల్లో అత్యధిక వాటా తీసుకుంటానని అతనన్నాడు. ఒక సినిమాకు సంబంధించి అందరికంటే ముందు రచయితకు పారితోషకం దక్కాలని.. ఆ తర్వాత చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ రెమ్యూనరేషన్ అందాలని.. ఇలా జరిగేలా చూసుకోవడం తన బాధ్యత అని ఆమిర్ అన్నాడు. అందుకే ముందు తాను పారితోషకం తీసుకోనని.. మిగతా వాళ్లందరికీ డబ్బులు అందేలా చూస్తానని అతనన్నాడు. ఒకవేళ సినిమా ఆడకపోతే తాను నష్టపోతానని.. అంతే తప్ప మిగతా వాళ్లకు మాత్రం ఇబ్బంది రాకుండా చూసుకుంటానని ఆమిర్ చెప్పాడు. ఈ రకంగా అత్యధిక రిస్క్ తీసుకుంటా కాబట్టి లాభాల్లో వాటా కూడా ఎక్కువగా తీసుకుంటానని అన్నాడు. లాభాల్లో వాటా తీసుకుంటా కాబట్టి సినిమా బాగా వచ్చేలా జాగ్రత్త పడతానని.. అందుకే తన సినిమాలు బాగుంటున్నాయేమో అని ఆమిర్ చెప్పడం విశేషం.