ఆచారి టైమింగ్ కి రీజన్ ఏంటో

0మంచు విష్ణు లేటెస్ట్ మూవీ ఆచారి అమెరికా యాత్ర. ఇప్పుడీ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజానికి ఈ సినిమా రిపబ్లిక్ డే వీకెండ్ లోనే విడుదల కావాల్సి ఉంది. అప్పటి నుంచి రకరకాల రీజన్స్ తో విడుదల వాయిదా పడుతూ వస్తోంది. సోలో రిలీజ్ కోసం ప్రయత్నాల లాంటివేమీ చేయలేదు కానీ.. సరైన టైమింగ్ కోసం చూస్తున్నారంతే.

ఇంతకాలం ఆపడంతో.. విష్ణు-బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేస్తారని అంతా భావించారు. అందుకు తగినట్లుగానే ప్లానింగ్ కూడా జరిగింది. కానీ ఏప్రిల్ 27న విడుదల కావాల్సిన బడా మూవీ రజనీకాంత్ కాలా వాయిదాపడ్డంతో ఈ డేట్ బాగానే దొరికింది. వెంటనే రిలీజ్ కి ప్రిపేర్ చేసేశారు. ఇది ఓకే అయినా.. రెండు భారీ సినిమాల మధ్యలో తీసుకెళ్లి ఆచారిని ఇరికించడం ఎంతవరకూ కరెక్టో అర్ధం కాని విషయం. ఇప్పటికీ రామ్ చరణ్ రంగస్థలం మూవీకి షేర్స్ వస్తున్నాయి. అందుకే చాలా స్క్రీన్స్ లో ఈ సినిమాను తీయడం లేదు. మరోవైపు మహేష్ మూవీ భరత్ అనే నేను సూపర్బ్ టాక్ తో దూసుకుపోతోంది.

మే 4వ తేదీన థియేటర్లలోకి రానున్న అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్యకు కూడా బజ్ భారీగానే ఉంది. ఆ తర్వాత మే నెలలో వచ్చేవన్నీ మీడియం బడ్జెట్ మూవీస్ మాత్రమే. అలాంటి టైం కాకుండా.. ఇప్పుడు భారీ చిత్రాల మధ్యలో ఇరికించడంతో.. బిజినెస్ పరంగా సినిమాకు బ్యాడ్ అంటున్నారు ట్రేడ్ జనాలు. మరి ఆ సినిమా నిర్మాతల వ్యూహం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.