పవన్ భజన చేయని ఒకేఒక్కడు

0భజంత్రీల పరిశ్రమలో భజన బాబులకు కొదవేం లేదు. ముత్యాల ముగ్గు రావుగోపాల్ రావ్ వెనక భజన బృందంలా ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కునేవాళ్లు ఎప్పుడో భజంత్రీలకు అలవాటు పడిపోయారు. ముఖ్యంగా అగ్రహీరోల భజన చేయనిదే తమకు పబ్బం గడవదన్న ఫీలింగ్ లోనూ ఉంటారు వీళ్లంతా. అయితే ఇండస్ట్రీ ఎగ్జిస్టెన్సీ అలాంటిది. అసలు ఈ ఇండస్ట్రీలో అగ్రహీరోల పేర్లకు చివర బాబు అనే తోక ఎందుకు? అని రామ్ గోపాల్ వర్మ అంతటివాడినే ప్రశ్నిస్తే.. దానికి అతడు కూడా అంతే సర్ ప్రైజింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇదంతా ఎగ్జిస్టెన్సీ కోసం.. పని సులువుగా – సాఫీగా సాగాలంటే ఇక్కడ ఇది తప్పదని అనేశారు ఓ సందర్భంలో.

మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటి ఛరిష్మాతో పరిశ్రమను నంబర్ -1 స్టార్ గా ఏలిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఆ భజన తప్పలేదు. అంతేకాదు.. పవన్ పేరు ఉపయోగించి ఎందరో సినిమా పరిశ్రమలో పబ్బంగడుపుకోవాలనుకున్నారు. పవన్ అభిమాని నితిన్ వరకూ మినహాయిస్తే చాలామందికి అది తప్పలేదు. ఇకపోతే అందరూ ఇదే తీరుగా భజనపరులేనా? అని వెతికితే .. ఓ డాక్టర్ కం యాక్టర్ మాత్రం అలాంటి భజన చేయనని నిక్కచ్ఛిగా చెప్పేశాడు. పవన్ భజన చేయడం ద్వారా ఆయన అభిమానుల్ని సంతుష్టుల్ని చేయలేనని సూటిగా చెప్పాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి `అత్తారింటికి దారేది` చిత్రంలో నటించిన డా.భరత్ రెడ్డి ఈ విషయంలో తన జెన్యూనిటీని సూటిగా ప్రకటించారు. పవన్ భజన చేయడాన్ని నేను గొప్పగా భావించను. పవన్ అభిమానుల్ని మెప్పించాలన్న ఆలోచనే లేదు.. అనడం చర్చకొచ్చింది. అంతేకాదు పవన్ కల్యాణ్ బయటకు మాట్లాడుతున్నదంతా జెన్యూన్ అని కూడా నేను భావించను.. అని కాస్తంత ఘాటుగానే అనేయడంపై వెబ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం భరత్ రెడ్డి `ఎన్టీఆర్` బయోపిక్ లో ఆయన పెద్ద కుమారుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రలో నటిస్తున్నారు. భరత్ టాలీవుడ్ లో క్యారెక్టర్ నటుడిగా రాణించిన సంగతి తెలిసిందే.