చిరు పవన్ ల సహకారం: సప్తగిరి కంటతడి

0saptagiriచిన్న చిన్న వేషాలతో హీరోగా మారిన సప్తగిరి అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. కామెడీ వేషాలు వేసుకోక ఎందుకు వీడికి హీరో వేషాలు అన్నవాళ్లు ఉన్నారు. కానీ సప్తగిరి తాను కన్న కలను సాకారం చేసుకొన్నారు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నాడు. ఎదిగిన కొద్ది ఒదుగుతూ నిర్మాతలకు కల్పవృక్షంగా మారారు. ఎన్నో విమర్శలకు సప్తగిరి ఎక్స్‌ప్రెస్ విజయంతో నోటికి తాళం వేశాడు. తాజాగా మెగాస్టార్ చేతుల మీదుగా సప్తగిరి అవార్డు అందుకొని మరోసారి తన సత్తాను చాటాడు. నిరంతర కృషితో ఎదుగుతున్న సప్తగిరికి మెగా బ్రదర్ సహకారం లభించడం మరింత క్రేజ్ పెంచింది. మెగా బ్రదర్స్ సహకారం ఎలా ఉపకరించిందంటే..

కామెడీ వేషాలతో జీవితాన్ని ప్రారంభించిన నటుడు సప్తగిరి హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. ఆ చిత్రానికి కాటమరాయుడు అని పేరు పెట్టుకొని షూటింగ్ ప్రారంభించారు. దాదాపు సినిమా పూర్తయింది. అదే సమయంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో నిర్మాత శరత్ మరార్ సినిమాను ప్రారంభించారు. ఆ చిత్రానికి కాటమరాయుడు అని పేరు పెట్టాలని చూశారు. అప్పటికే ఆ టైటిల్ సప్తగిరి సినిమా పేరిట రిజిస్టర్ అయింది. దాంతో సప్తగిరి, నిర్మాతలను శరత్ మరార్ సంప్రదించి పవన్ కల్యాణ్ సినిమాకు టైటిల్ ఇవ్వమని కోరాడు. దాంతో వారు కాటమరాయుడు టైటిల్‌ను పవన్ సినిమాకు ఇచ్చి తమ సినిమాకు సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌గా మార్చుకొన్నారు.

కాటమరాయుడు సినిమా టైటిల్ ఇచ్చినందుకు గానూ సప్తగిరికి, నిర్మాతకు పవన్, శరత్ మరార్ థ్యాంక్స్ చెప్పారు. ఎన్నడూ సినిమా కార్యక్రమాలకు హాజరుకాని పవన్ కల్యాణ్.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్ర ఆడియో కార్యక్రమానికి పవర్ స్టార్ హాజరయ్యారు. సప్తగిరి మంచి పేరు తెచ్చుకోవాలని, సినిమా ఘన విజయం సాధించాలని పవన్ కోరుకొన్నారు. అంతేకాకుండా సప్తగిరికి ఆశీస్సులు అందజేశారు. కాటమరాయుడు టైటల్ ఇచ్చినందుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

ఆ తర్వాత సప్తగిరి సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకొన్నది. సప్తగిరికి హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల్లో పాపులర్ క్యాటగిరీలో ఉత్తమ చిత్రం అవార్డును అందుకొన్నది. అయితే ఆ అవార్డును సప్తగిరి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా నటుడు సప్తగిరి ఉద్వేగానికి లోనయ్యారు. ఆడియో వేడుకలో పవన్ కల్యాణ్ వచ్చిన విషయాన్ని, ప్రస్తుతం మెగాస్టార్ చేతులు మీదుగా అవార్డు అందుకోవడం జీవితంలో మరచిపోలేని విషయమని సప్తగిరి అన్నారు.

ఈ అవార్డుల కార్యక్రమంలో సప్తగిరి మాట్లాడుతూ.. కలను కనడమే కాదు.. సాకారం చేసుకోవడం గొప్ప. నటుడిగా సినీ పరిశ్రమలో స్థిరపడాలని కలగన్నాను. సినిమాలో రావడానికి చిరంజీవి గారే స్ఫూర్తి. ఎన్నటికైనా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకోవాలని ఆశపడ్డాను. అవార్డును అందుకొంటూ ఫొటో దిగి నా ఇంట్లో పెట్టుకోవాలని అనుకొన్నాను. ఆ ఫోటోను ఉదయమే లేచి చూస్తే జీవితం ధన్యమైపోతుందనే భావనలో ఉన్నాను. అది సాక్షి మీడియా కారణంగా సాధ్యమైంది అని సప్తగిరి ఉద్వేగానికి లోనయ్యారు. మెగాస్టార్ చిరంజీవిని పాదాలను తాకి సప్తగిరి ఆశీస్సులు అందుకొన్నారు.