`కూలీ నంబర్ -1` రీమేక్ లో స్టార్ కిడ్స్

0

ఓల్డ్ క్లాసిక్స్ ని రీమేక్ చేయడం ఎంత రిస్కో తెలిసిందే. అయినా కొన్నిటిని సక్సెస్ ఫుల్ గా తెరపైకి తెస్తోంది నవతరం ట్యాలెంట్. బాలీవుడ్ క్రేజీ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ ఇదివరకూ `జుడ్వా 2` లో నటించిన సంగతి తెలిసిందే. సల్మాన్ నటించిన క్లాసిక్ హిట్ `జుడ్వా`కి ఎన్నో మార్పులు చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ప్రస్తుతం మరోసారి అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. ఈసారి స్టార్ కిడ్స్ వరుణ్ ధావన్ – సారా అలీఖాన్ జంటగా `కూలీనంబర్- 1`(1995) చిత్రాన్ని రీమేక్ చేస్తుండడం ఆసక్తికరం.

గోవిందా – కరిష్మా జంటగా వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ తెరకెక్కించిన `కూలీనంబర్ 1` అప్పట్లో బంపర్ హిట్. ఈ చిత్రంలో గోవిందా కామెడీ అభిమానుల్ని పీక్స్ లో అలరించింది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఆ సినిమాని మరోసారి హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. “ఇది మక్కీకి మక్కీ రీమేక్ కాదు. కేవలం అడాప్టేషన్ మాత్రమే. ఒరిజినల్ లోని స్క్రీన్ ప్లేని యథాతథంగా చూపిస్తాం. కథలో.. సన్నివేశాల్లో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నాం. గత 15ఏళ్లలో అలాంటి పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాన్ని నేను చూడనేలేదు. ఆ సినిమా స్క్రీన్ ప్లే అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నటిస్తున్నా. డాడ్ (డేవిడ్ ధావన్) దర్శకుడిగా అప్పట్లో గ్రేట్. ఆ సినిమాతో నేను నటించే సినిమాకి పోలికలు పెడతారని తెలుసు. అయినా ఛాలెంజింగ్ గానే తీసుకున్నా“ అని తెలిపాడు. ఇకపోతే తెలుగులో వెంకీ – టబు జంటగా అప్పట్లోనే కూలీ నంబర్1 చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సంగతి తెలిసిందే.

వరుణ్ ధావన్ నటించిన కళాంక్ ఇటీవలే రిలీజై మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ ఆ చిత్రాన్ని నిర్మించారు. తదుపరి శశాంక్ ఖైతాన్ రూపొందిస్తున్న రణ్భూమి రెమో డి సౌజా దర్శకత్వం వహిస్తున్న స్ట్రీట్ డ్యాన్సర్ చిత్రాల్లో వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. సారా అలీఖాన్ ప్రస్తుతం లవ్ ఆజ్ కల్ 2లో నటిస్తోంది. ఈ యంగ్ జోడీ కి యువతరంలో ఇప్పటికే అసాధారణ క్రేజు ఉంది. కేదార్ నాథ్ సింబా చిత్రాలతో హిట్లు కొట్టి సారా దూకుడుమీద ఉండడంతో ధావన్ బోయ్ తో ఆఫర్ ని క్రేజీగానే భావిస్తున్నారు తన ఫ్యాన్స్.




Please Read Disclaimer