ఆర్థిక ఇబ్బందుల్లో భూమిక చావ్లా.. ఏంజరిగింది?

0bhumika-chawlaసినిమా పరిశ్రమలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతుంటాయి. ఓవర్‌నైట్‌లో సూపర్ స్టార్ అయిన వాళ్లు కనిపిస్తారు. అది నిలబట్టుకోలేక కుప్పకూలిన వాళ్లు కనిపిస్తారు. ప్రస్తుతం ఒకప్పటి టాప్ హీరోయిన్ భూమికా చావ్లా పరిస్థితి అలానే కనిపిస్తుంది. సినిమా అవకాశాలు లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటం కారణంగా ఎలాంటి పాత్రనైనా పోషించడానికి సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ సరసన టాప్ హీరోయిన్‌గా నటించిన భూమిక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోతున్నది.

టాలీవుడ్‌లో హీరో సుమంత్ సరసన యువకుడు చిత్రంలో నటించడం ద్వారా భూమిక మంచి గుర్తింపును పొందారు. ఆ తర్వాత సింహాద్రి, ఖుషీ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించారు. నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్రహీరోలతో జతకట్టారు. మిస్సమ్మ, అనసూయ లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించారు. అలాంటి క్రేజ్ ఉన్న భూమిక కెరీర్ ఉన్నట్టుండి మసకబారిపోయింది.

భూమిక కెరీర్‌ పతనం కావడానికి ప్రేమ, పెళ్లి ప్రధాన కారణమని అప్పట్లో వినిపించింది. యోగా గురువు భరత్ ఠాకూర్‌ను భూమిక ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో కష్టాలు ప్రారంభమయ్యాయట. ఆ తర్వాత ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. అలా దక్షిణాది సినిమా పరిశ్రమ నుంచి కనుమరుగైపోయింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన తేరా నామ్ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. తేరానామ్ తెలుగులో శేషు, తమిళంలో సేతు చిత్రానికి రీమేక్‌గా రూపొందిన సంగతి తెలిసిందే.

ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ధోని చిత్రంలో హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు అక్కగా నటించింది. ఆ చిత్రంలో ధోని సోదరి పాత్రను పోషించింది. ఆమె పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత పెద్దగా బాలీవుడ్ అవకాశాలు వచ్చిన దాఖలాలు లేవు.

ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో క్యారెక్టర్ పాత్రలో నటించడానికి భూమిక సిద్ధపడినట్టు తెలుస్తున్నది. నేచురల్ స్టార్ నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఎంసీఏ అనే చిత్రంలో భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తున్నదట. నానీతో ఈ సినిమాలో అక్కగా గానీ, వదినగానీ కనిపించే అవకాశం ఉందని తెలుస్తున్నది. హిట్ల మీద హిట్లతో దూసుకెళ్తున్న నానికి మరో హిట్ సాధిస్తే భూమిక కెరీర్‌ కూడా గాడిలో పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.