గురుదక్షిణ అంటే ఇదీ..

0Actress-Tulasi-to-organise-పది రోజుల కిందట దర్శకరత్న దాసరి నారాయణరావు తుది శ్వాస విడిచారు. ఆయన సినీ పరిశ్రమలో ఎంతమందికి జీవితాన్నిచ్చారో.. ఎన్ని కుటుంబాల్ని నిలబెట్టారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ దాసరి వల్ల జీవితంలో స్థిరపడ్డ చాలామంది ఆయన్ని కడసారి చూసేందుకు రాలేదు. చనిపోయినపుడు కాదు.. దాసరి బతికుండగా కూడా.. ఆయన వల్ల లబ్ది పొందినవాళ్లు పట్టించుకోని ఉదంతాలున్నాయి. సినీ పరిశ్రమలో అన్నీ డబ్బు.. పేరు చుట్టూనే తిరుగతాయనడానికి ఇది ఉదాహరణ. ఐతే అందరినీ ఈ గాటన కట్టేయలేం. తమకు జీవితాన్నిచ్చిన గాడ్ ఫాదర్స్‌ను గుర్తుంచుకుని వాళ్లను గౌరవించుకునే వాళ్లూ కొందరుంటారు. సీనియర్ నటి తులసి ఈ కోవకే చెందుతారు.

విశ్వనాథ్ ఆల్ టైం క్లాసిక్ ‘శంకరాభరణం’ ద్వారా తెలుగు పరిశ్రమకు బాల నటిగా పరిచయమై.. ఆ తర్వాత హీరోయిన్, సైడ్ క్యారెక్టర్లు చేసి సినీ రంగంలో స్థిరపడిన తులసి.. తనకు ఇంతటి గుర్తింపు వచ్చేలా చేసిన విశ్వనాథ్‌ను సముచిత రీతిలో గౌరవించబోతోంది. విశ్వనాథ్ పేరు మీద ఆమె ప్రతి సంవత్సరం అవార్డుల వేడుక చేయాలని నిర్ణయించింది. పురస్కారాల ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు ఈ ఏడాది పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 20న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ వేడుకకి తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఆయనతో పాటు తెలుగు చిత పరిశ్రమ నుంచి ఎందరో ప్రముఖులు విచ్చేయనున్నారు.

కొంచెం పెద్ద స్థాయిలోనే ఈ వేడుక చేయబోతున్నారు తులసి. గత ఏడాది కాలంలో వచ్చిన సినమాల్లో ప్రతిభ చాటుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ వేడుకలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ వేడుక ఏటా జరుగుతుందట. తులసి ప్రచారం కోసం చేస్తున్న ప్రయత్నిమిదని కొందరు తేలిగ్గా తీసేస్తున్నప్పటికీ.. గురువు పేరు చెప్పి ఈ మాత్రం చొరవ తీసుకునేవాళ్లు సినీ పరిశ్రమలో ఎంతమంది ఉంటారు చెప్పండి?