అనీల్ అంబానీ కోర్కెలకు ఏపీ సర్కార్ షాక్

0anil-ambaniప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సార‌థ్యంలోని అడాగ్(అనీల్ ధీరూభాయి అంబానీ గ్రూప్) కోర్కెలు విని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అవాక్క‌యింది. విశాఖ‌ప‌ట్ట‌ణంలో రూ.5 వేల కోట్ల‌తో నౌకాద‌ళానికి అవ‌స‌ర‌మైన యుద్ధ ప‌రిక‌రాల క‌ర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామంటూ నిరుడు ప్ర‌క‌టించిన అడాగ్ గ్రూప్ ప్ర‌భుత్వం ముందు తమ కోర్కెల చిట్టా ఉంచింది.

ఉచితంగానే..

తాము నిర్మించే క‌ర్మాగారానికి తొలుత వెయ్యి ఎక‌రాలు కావాలన్న అడాగ్ ఆ త‌ర్వాత దానిని 2వేల ఎక‌రాల‌కు పెంచింది. అది కూడా ఉచితంగా కావాలంటూ ప్ర‌తిపాదించింది. ఏడాదికి ఎక‌రానికి రూపాయి అద్దె చొప్పున 99 ఏళ్ల‌పాటు లీజుకు ఇవ్వాల‌ని కోరింది. ఇక్క‌డితో కోర్కెల చిట్టా అయిపోలేదు.

చిట్టా పెద్దదే

తాము కోరిన‌ట్టు భూమి ఇస్తే మొద‌ట రూ.5వే కోట్లు పెట్టుబ‌డి పెడ‌తామ‌ని పేర్కొన్న సంస్థ.. అందులో 20 శాతం పెట్ట‌బ‌డి రాయితీ కావాల‌ని మ‌రో మెలిక పెట్టింది. అంటే వెయ్యి కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వమే ఎదురు స‌మ‌ర్పించుకోవాల‌న్న మాట‌. వీటితోపాటు స్టాంప్ డ్యూటీ నుంచి అన్ని రకాల ప‌న్ను మిన‌హాయింపులు కావాల‌ని డిమాండ్ చేసింది.

రాయితీలూ కల్పించాలి..

యూనిట్ విద్యుత్‌ను రూ.2.50 చొప్పున 25 ఏళ్ల‌పాటు ఇవ్వాల‌ని, 25 ఏళ్ల‌పాటు నీటిని ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరింది. తాము కోరిన సౌక‌ర్యాలు క‌ల్పిస్తే రిల‌య‌న్స్ డిఫెన్స్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ పేరుతో క‌ర్మాగారం ప్రారంభించి ప్ర‌త్య‌క్షంగా మూడువేల మందికి, ప‌రోక్షంగా ఆరువేల మందికి ఉపాధి క‌ల్పిస్తామ‌ని తెలిపింది. అంతేగాక కొత్త‌గా తీసుకునే ఉద్యోగుల‌కు శిక్ష‌ణ కాలంలో తొలి రెండు నెల‌ల జీతాన్ని ప్ర‌భుత్వ‌మే చెల్లించాల‌ని ప్ర‌తిపాద‌న‌ల్లో పేర్కొంది.

విస్తుపోయిన ఏపీ సర్కారు

రిల‌య‌న్స్ కోర్కెల చిట్టాను చూసి విస్తుపోవడం ఏపీ స‌ర్కారు వంతైంది. అయితే ప్ర‌భుత్వం మాత్రం ఇంకా ఆశావహ దృక్ప‌థంతోనే ఉంది. కంపెనీ ప్ర‌తిపాద‌న‌ల‌పై ప‌రిశీల‌ను ఓ క‌మిటీని నియ‌మించింది. అచ్యుతాపురం మండ‌లంలో ఎక‌రా భూమిని రూ.17.5 ల‌క్ష‌ల చొప్పున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు పేర్కొంది.

సానుకూలంగానే ఏపీ

ప్రాజెక్టు ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న ప్ర‌భుత్వం వీలైనంత హేతుబ‌ద్ధంగా ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంది. వ్యాట్‌, సీఎస్టీ, జీఎస్టీల‌పై ఏడేళ్ల వ‌ర‌కు 100 శాతం రాయితీ ఇచ్చేందుకు అంగీక‌రించింది. కాగా, విశాఖ దక్షిణ తీరాన 70కి.మీల పరిధిలో రిలియన్స్ షిప్ యార్డ్ కోసం ఏపీ ప్రభుత్వం 1500 ఎకరాల భూమిని ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది.